సినిమాల్లో మాత్రమే కాకుండా చాలా ఏళ్లుగా బుల్లి తెరపై కూడా కనిపిస్తూ వస్తున్నాడు. జబర్దస్త్ కామెడీ షో లో చాలా ఏళ్ల పాటు నాగబాబు కనిపించాడు. నాగబాబు నవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు. నాగబాబు ప్రస్తుతం అదిరింది బొమ్మ కామెడీ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక యూట్యూబ్ లో నాగబాబు సందడి మామూలుగా ఉండదు.
నాగబాబు ఎంటర్ టైన్ మెంట్ అందించడంలో మాత్రమే కాకుండా పొలిటికల్ గా కూడా చాలా కాలంగా జర్నీ కొనసాగిస్తున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టడానికి ముందు నుండే అభిమానులతో భేటీ అయ్యి వారితో మాట్లాడుతూ పార్టీ పెడితే ఎలా ఉంటుంది, మద్దతు ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి సర్వే చేశాడు.
దాదాపు ఆరు నెలల పాటు అభిమానులతో వరుసగా భేటీలు అయిన నాగబాబు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అన్నయ్య చిరంజీవికి వెన్ను దన్నుగా ఉన్నాడు. ఆ తర్వాత పార్టీ పోయింది. రాజకీయాలకు కొంత కాలం దూరం అయ్యాడు. మళ్లీ తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెడితే ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. గత ఎన్నికల్లో పార్లమెంటుకు సైతం పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నాడు.
నిర్మాతగా ఆరెంజ్ సినిమాతో భారీగా నష్టపోయిన నాగబాబు అప్పటి నుండి మళ్లీ నిర్మాణం వైపుకు వెళ్లడం లేదు. చాలా ప్రాజెక్ట్ లు ఆయన వద్దకు వచ్చాయి. కాని ఆయన మాత్రం బాబోయ్ నా వల్ల కాదు అన్నట్లుగా పక్కకు తప్పుకుంటున్నాడు. ఆయన తన వారసులు అయిన వరుణ్ తేజ్ మరియు నిహారికలను సైతం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
వరుణ్ తేజ్ యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే స్టార్ డం దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక నిహారికను కూడా హీరోయిన్ గా పరిచయం చేసిన నాగబాబు ఆమెకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు. ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ తండ్రి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ప్రశంసలు దక్కించుకున్నాడు.
తమ్ముడిగా.. అన్నగా.. కొడుకుగా.. నాన్నగా.. భర్తగా.. నటుడిగా.. జడ్జ్‌గా ఇలా అన్ని విధాలుగా తనదైన పూర్తి న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నించే వ్యక్తి నాగబాబు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని మంచి సినిమాల్లో నటించడంతో పాటు మంచి టీవీ షోల్లో కనిపించాలంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్ డే మెగా బ్రదర్ నాగబాబు.