ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

గాడ్సేపై నాగబాబు ట్వీట్‌: జనసేనకు కొత్త తలనొప్పి

మహాత్మాగాంధీని చంపేశాడు గనుక, నాథూరామ్ గాడ్సే మంచోడు కాదు. చరిత్ర మనకి చెప్పేది ఇదే. జాతి పిత మహాత్మాగాంధీని అభిమానించేవారెవరూ గాడ్సేని పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించరు. ఇది చరిత్ర చెబుతోన్న సత్యం. కానీ, ఆ గాడ్సే జయంతిని సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు గుర్తు చేసుకున్నారు.

‘దేశభక్తుడు గాంధీని చంపడం కరెక్టా? కాదా? అనేది డిబేటబుల్‌. కానీ అతని వైపు ఆరుగ్యమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. ఈ రోజుల్లో కూడా చాలావరకు అంతే. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే.. మే హిస్‌ సోల్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ నాగబాబు ట్వీట్లేశారు. దానికి తోడుగా ఓ వీడియో కూడా పోస్ట్‌ చేశారు నాగబాబు. అంతే, దుమారం షురూ అయ్యింది.

మహాత్ముడి మరణం నుంచి ఇప్పటిదాకా.. ఎప్పటికప్పుడు నాథూరాం గాడ్సే గురించిన చర్చలు జరుగుతూనే వున్నాయి. కొందరు గాడ్సేని సమర్థించారు.. అలా సమర్థించినోళ్ళంతా దేశద్రోహులుగా ముద్ర వేయబడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కాంట్రవర్షియల్‌ టాపిక్‌ని నాగబాబు ఎందుకు ఎత్తుకున్నట్లు.? నాగబాబుకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు వుండొచ్చుగాక. కానీ, అది జనసేన పార్టీకి ఇబ్బంది కలిగిస్తే ఎలా.? జనసైనికుల ఆవేదన ఇది.

నాగబాబు కారణంగా జనసేనకు అదనంగా ఒరిగిందేమీ లేదనీ, పైగా నష్టమే ఎక్కువగా జరుగుతోందంటూ పవన్‌ కళ్యాణ్‌కి సోషల్‌ మీడియా ద్వారా జనసైనికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవికి కూడా నాగబాబు విషయమై సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు అందుతున్నాయి.

రాజకీయాల్లో వున్నప్పుడు వీలైనంతవరకు కాంట్రవర్షియల్‌ విషయాల్లోకి వెళ్ళకపోవడమే మంచిదని నాగబాబు తెలుసుకుంటే మంచిదన్నది జనసైనికుల వాదన. ఇక, ఇతర పార్టీల మద్దతుదారులు నాగబాబుపై విమర్శలు చేయడంలో వింతేముంది.? అది అత్యంత జుగుప్సాకరంగా కొనసాగుతోందనుకోండి.. అది వేరే సంగతి.

Exit mobile version