ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘కూతలు – కోతలు..’ లోకేష్‌ సెటైర్‌ అదిరిందిగానీ.!

‘ఎన్నికల ముందు కూతలు (ఎన్నికల హామీలు), అధికారం వచ్చాక కోతలు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌. చంద్రబాబు పుత్రరత్నం ఏ విషయమ్మీద సెటైర్‌ వేశారో తెలుసా.? ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్వీర్యం చేయడం గురించి.. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేస్తోన్న విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ని రద్దు చేయడం గురించి.!

చంద్రబాబు హయాంలో ‘ఎన్టీఆర్‌ విదేశీ విద్య’ అనే పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. దానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ గతంలోనే బ్రేకులు వేసింది. తాజాగా, ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ని రద్దు చేస్తూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. నిజానికి, ఈ రెండూ పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉపయోగపడేవే.

‘మేం ఉద్ధరించేస్తున్నాం..’ అంటూ, ‘పప్పూ బెల్లం’ తరహాలో, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌, పేద విద్యార్థులకు ఉపయోగపడే పథకాల్ని రద్దు చేయడం, కోతలు విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం వుంది. ‘మీ పిల్లలకు మాత్రమే ఫారెన్‌ చదువులా.? బడుగు బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా.?’ అని నారా లోకేష్‌ ప్రశ్నించడం. ఇంగ్లీషు మీడియం విషయమై, దాదాపు ఇలాంటి ప్రశ్ననే వైసీపీ, టీడీపీ మీదకు సంధిస్తోన్న విషయం విదితమే.

ఇటు టీడీపీదీ, అటు వైసీపీదీ.. ఇద్దరిదీ రాజకీయమే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎవరు ఏం చేసినా, అంతిమంగా పబ్లిసిటీ స్టంట్స్‌ కోసమే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. చంద్రబాబు హయాంలోనూ, ‘కోతలు’ చూశాం. అధికారంలోకి వచ్చేదాకా కూతలు.. అధికారంలోకి వచ్చాక కోతలు.. మామూలే.

ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ విషయంలో చంద్రబాబు సర్కార్‌ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో నానా యాగీ చేసిన వైసీపీ, ఇప్పుడు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌కి సంబంధించి రకరకాల ఆంక్షలు పెడుతోన్న వైనం అందరికీ కన్పిస్తూనే వుంది. ఒక్కటి మాత్రం నిజం.. అందరూ పేదల గురించే మాట్లాడతారు.. కానీ, రాజకీయ నాయకులు మాత్రమే అపర కుబేరులవుతుంటారు.

Exit mobile version