ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. లోకేష్ పై టీడీపీ ఒత్తిడి

చంద్రబాబు వారసుడిగా, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ని ఎంత లేపాలని చూసినా ఆయనలో చలనం కలగడంలేదు. ఎన్నికల ప్రస్తావన లేకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి చేతిలో పెట్టి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టి.. ఇలా కొడుకు భవిష్యత్ కోసం చాలానే చేశారు బాబు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. అమోఘమైన “తెలివితేటల”తో ఎప్పటికప్పుడు తన అసమర్థతను నిరూపించుకుంటూనే ఉన్నారు లోకేష్.

ఓవరాల్ గా లోకేష్ అసమర్థుడు, అతని చేతిలో పార్టీని పెట్టడం ఆత్మహత్యా సదృశం అని టీడీపీ శ్రేణులు కూడా గట్టిగా నమ్మే పరిస్థితి వచ్చింది. కనీసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడైనా తనని తాను నిరూపించుకోడానికి లోకేష్ చేసిన ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటీ లేదు. వాస్తవానికి కరోనా టైమ్ లో లోకేష్ అధికార పార్టీ నేతలకు ధీటుగా ఏపీలో ప్రజలకు బాసటగా నిలిస్తే కాస్త మైలేజీ అన్నా దక్కేది.

నిజానికి టీడీపీ తరపున కొవిడ్-టీమ్ ఏర్పాటు చేసి, లోకేష్ పర్యవేక్షణలో ఊరూరా సహాయక చర్యలు చేపట్టి, సొంత మీడియాతో దాన్ని హైలెట్ చేయించడానికి ఓ ప్రణాళిక ఇంతకు ముందే సిద్ధమైంది. చంద్రబాబు కూడా దాన్ని ఓకే చేశారట. కానీ లోకేషే ఎందుకో వెనక్కి తగ్గారని అంటున్నారు. లోకేష్ కి రాజకీయాల మీద ఆసక్తి లేనట్టు, అందుకే ఆయన పూర్తిస్థాయిలో జనాల్లోకి రాలేకపోతున్నట్టు పార్టీవర్గాలంటున్నాయి.

తెలివితోపాటు రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం వల్లే చినబాబు జాకీలకు పైకి లేవడం లేదని, అందుకే చంద్రబాబులో దిగులు పెరిగిపోతోందని చెప్పుకుంటున్నారు. మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇవ్వమని చెబితే.. పిల్లాడ్ని వెంటేసుకుని సైకిల్ పై రౌండ్లు వేయడానికి వెళ్లిపోతున్నారంటూ లోకేష్ పై జోకులు పేలుతున్నాయి. వాస్తవానికి లోకేష్ కి ఆసక్తి ఉన్నా లేకపోయినా పెద్దగా చేసేదేం లేదు. లోకజ్ఞానం లేకపోవడమే చినబాబుకి ఉన్న పెద్ద మైనస్. అందుకే సోషల్ మీడియాలో లోకేష్ టీమ్ తో చంద్రబాబే అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టిస్తుంటారు. నేరుగా కెమెరా ముందుకొస్తే అయ్యగారు ఎంత బీభత్సం చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో.. తాడో పేడో తేల్చుకోవాలంటూ లోకేష్ పై ఒత్తిడి పెరుగుతోందట. తండ్రిచాటు బిడ్డగా ఉన్న ఇమేజ్ ని చెరిపేసుకోవాలని బాబు కూడా పోరు పెడుతున్నారట. ఇప్పట్నుంచి వర్క్ ప్రారంభించకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నిలబెట్టడం కష్టమనేది అందరిమాట. అందుకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ముఖ్యనాయకులంతా చినబాబుకి నచ్చజెబుతున్నారు. మరి లోకేష్ లో ఇకనైనా చలనం కలుగుతుందేమో చూడాలి.

Exit mobile version