ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నీలి నీలి ఆకాశం.. ఇది కదా రికార్డంటే

కొన్ని నెలల కిందట ‘అల వైకుంఠపురములో’ పాటల తాలూకు లిరికల్ వీడియోలు యూట్యూబ్‌లో ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇందులోని ‘సామజ వరగమన’.. ‘రాములో రాములా’.. ‘బుట్ట బొమ్మా’ పాటలు మూడూ 10 కోట్ల వ్యూస్ మార్కును దాటాయి.

ఆ తర్వాత సిినిమా నుంచి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తే అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఐతే ఈ పాటలు ఎంత బాగున్నా సరే.. వాటికి ఆ స్థాయిలో వ్యూస్ రావడంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌, తమన్‌ల స్టార్ పవర్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ఈ సినిమా స్కేల్ పెద్దది కావడం వల్ల పాటల రీచ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. కానీ ఓ కొత్త హీరో.. కొత్త హీరోయిన్.. కొత్త దర్శకుడు.. కొత్త నిర్మాత.. అంతగా ఫాంలో లేని సంగీత దర్శకుడు.. కలిసి చేసిన సినిమాలోంచి ఓ పాటకు 10 కోట్ల డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మాత్రం అది కచ్చితంగా సంచలన విషయమే.

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘నీలి నీలి ఆకాశం’ 10 కోట్ల వ్యూస్‌తో ఔరా అనిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట రిలీజనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్‌ టాక్‌లో ఈ పాటకు అసాధారణమైన స్పందన లభించింది. ఒకసారి పాట పాపులర్ అయ్యాక దాని రీచ్, రేంజ్ రెండూ మారిపోయాయి.

‘అల వైకుంఠపురములో’ పాటలకు దీటుగా జనాలు ఈ పాటను ఆదరించారు. వ్యూస్, లైక్స్ ఇచ్చారు. ఈ సినిమా రేంజ్ ప్రకారం చూస్తే పది కోట్ల వ్యూస్ అన్నది అసాధారణమైన విషయం. చిన్న సినిమాల్లో ఇది నెవర్ బిఫోర్ రికార్డనడంలో మరో మాట లేదు. మధ్యలో కొన్నేళ్లు కనిపించకుండా పోయిన అనూప్ రూబెన్స్ ఈ పాటతో మళ్లీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. కేవలం ఈ పాట వల్లే ఈ చిత్రానికి మంచి క్రేజ్ కూడా వచ్చింది. కరోనా ఎఫెక్ట్ లేకుంటే మార్చిలోనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ రిలీజ్ కావాల్సింది.

Exit mobile version