తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రోజుకు రెండంకెల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుంటే.. ఒకరో ఇద్దరో చనిపోతుంటేనే వామ్మో అనుకుంటున్నాం. అలాంటిది ఒక్క రోజులో ఒక్క సిటీలోనే వందకు పైగా కేసులు, రెండంకెల సంఖ్యలో మరణాలు అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే.. ముంబయి మొత్తంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అందులో 135 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ అనదగ్గ ధారావిలో కొన్ని రోజుల కిందట రెండు కరోనా కేసులు బయటపడినప్పుడే.. ముంబయిలో కరోనా వ్యాప్తి వేగంగా ఉండబోతోందని.. వందల కేసులు బయటపడబోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తగ్గట్లే ఇప్పుడు కేసులు, మరణాలు వెలుగు చూస్తున్నాయి.
అమెరికాలో న్యూయార్క్ ఎలా కరోనా ధాటికి అల్లాడిపోతోందో.. మున్ముందు ముంబయి సిటీ అలా ఘోరాలను చూడబోతోందని కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐతే ప్రమాదాన్ని ఊహించి ముంబయి అధికారులు కొంచెం చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు జరుగుతున్న నగరం ముంబయే. కాబట్టే ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 7 వేలకు చేరువగా ఉన్నాయి.