ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఏపీలో లోకల్ ఫైట్: చిందర వందర గందరగోళమే అంతా.!

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు ఆ షెడ్యూలుని సస్పెండ్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని ఎస్ఈసీ, మరో బెంచ్‌లో సవాల్ చేసింది. ‘అంత అర్జంటుగా విచారణ జరపాల్సిన అవసరం లేదు’ అంటూ ఇంకోసారి హైకోర్టు తేల్చి చెప్పడంతో ఎస్ఈసీ అయోమయంలో పడింది.

అసలు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా.? లేదా.? అన్నదానిపై స్పష్టత కొరవడింది. ఎలక్ట్రోరల్ రోల్స్ పంపిణీ వ్యవహారం మాత్రం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం గమనార్హం. సుప్రీం కోర్టు తీర్పుకి లోబడి ఎన్నికల కోడ్ విషయమై వ్యవహరిస్తామనీ రాష్ట ప్రభుత్వం హైకోర్టుకి తెలిపిందట. అంటే, ఎన్నికల కోడ్ అమల్లో వున్నట్టా.? లేనట్టా.? ఇది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.

అంతా అయోమయం.. ఎటు చూసినా గందరగోళం. బహుశా దేశ రాజకీయాల్లోనే ఇంతటి గందరగోళం ఇంకెప్పుడూ చోటు చేసుకోలేదేమో. రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ మధ్య ఆధిపత్య పోరులా తయారైంది వ్యవహారం. కాదు కాదు, ముఖ్యమంత్రికీ.. రాష్ట ఎన్నికల కమిషనర్‌కీ మధ్య గొడవలా మారింది పరిస్థతి.

మార్చి 31 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగుతారు. ఆలోగా స్థానిక ఎన్నికలు జరపకూడదనే పట్టుదలతో వుంది రాష్ట ప్రభుత్వం. కాగా, ఈ నెల 18వ తేదీన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై విచారణ చేస్తామని హైకోర్టు చెబుతోంది. అక్కడికి ఓ వారంలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి వుంది. అదెలా సాధ్యమవుతుంది.?

ఒకసారి కాదు, ఒకటికి రెండు సార్లు ఎస్ఈసీ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించిన దరిమిలా.. పంచాయితీ ఎన్నికలు ప్రస్తుతానికి అటకెక్కినట్లే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా వుండగా.. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగే పరిస్థితే వుండకపోవచ్చు.

Exit mobile version