తాజాగా, జనసేన అధినేత రైతు దీక్ష చేశారు. కష్ట కాలంలో రైతుల్ని ఆదుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, వరదల కారణంగా పంటను కోల్పోయిన రైతుల్ని ఓదార్చారు.. వారికి భరోసానిచ్చారు.. వారి సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అనంతరం, నిన్న ఒక రోజు నిరాహార దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టాయి. అయితే, ‘ఇంట్లో కూర్చుని నిరాహార దీక్ష చేయడమేంటి.?’ అంటూ కొందరు వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు.
వైసీపీ అను’కుల’ మీడియాదీ ఇదే పైత్యం. దీక్షలు ఎక్కడ చేయాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఒకవేళ జనసేన అధినేత గనుక, జనంలోకి వచ్చి దీక్ష చేయాలనుకుంటే.. వైసీపీ ప్రభుత్వం తట్టుకోగలదా.? ఏదో ఒక గలాటా సృష్టించి, ఆ దీక్షను భగ్నం చేయడమో.. లేదంటే, ఇంకేదన్నా కుట్ర పన్నడమో చేయకుండా అధికార పార్టీ వుంటుందా.?
పంట చేలల్లోకి దిగి, బురదని లెక్క చేయకుండా నేలకొరిగిన పంటను చేత్తో పట్టుకుని పరిశీలించిన పవన్ కళ్యాణ్‌కి.. రోడ్డెక్కి నిరాహార దీక్ష చేయాల్సి వస్తే.. అది పెద్ద విషయమే కాదు. రోడ్డుపై నడిచి వెళుతూ, ఓ చిన్న గట్టు మీద కూర్చుని, సాధారణ ప్రజానీకంతో వివిధ అంశాలపై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇంట్లో కూర్చుని, దీక్ష చేయడాన్ని చూసి.. ‘హమ్మయ్యా..’ అని అధికార పార్టీ ఊపిరి పీల్చుకోవాలి తప్ప, ఎగతాళి చేయకూడదు.
అయినా, సకాలంలో రైతుల్ని ఆదుకోండి మొర్రో.. అంటూ జనసేన అధినేత చేసిన విజ్ఞప్తిని పట్టించుకోవడం మానేసి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడం మానేసి.. ‘పవన్ కళ్యాణ్ ఎక్కడ దీక్ష చేశారో తెలుసా.?’ అంటూ అవాకులు చెవాకులు పేలడమేంటట.? ప్రభుత్వం, రైతులకు బాధ్యతగా చేయాల్సిన సాయం కోసం జనసేన పార్టీ రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేయాల్సి వస్తోందంటే.. తమ పాలన ఎంత దారుణంగా వుందో సమీక్షించుకోవాలన్న ఇంగితం లేని అధికార పార్టీ నుంచి అవాకులు చెవాకులు తప్ప ఏం ఆశించగలం.?