ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జనసైనికుడు వెంగయ్య, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేదింపుల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన దరిమిలా, బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 8.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు జనసేనాని. వెంగయ్య పిల్లల చదువుల బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘అదఃపాతాళానికి తొక్కి తీరతాం..’ అని జనసేనాని స్పష్టం చేశారు. గ్రామంలో రోడ్ల దుస్థితిని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి జనసైనికుడు వెంగయ్య తీసుకెళ్ళగా, రాయడానికి వీల్లేని పరుష పదజాలంతో సదరు ఎమ్మెల్యే, జనసైనికుడిపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వెంగయ్యను మానసికంగా వేదించారు. ఈ క్రమంలో వెంగయ్య, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే, మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వనందున బలవన్మరణానికి వెంగయ్య పాల్పడ్డాడంటూ వెంగయ్యపై కట్టుకథల్ని ప్రచారం చేసింది బులుగు మీడియాతోపాటు, పచ్చ మీడియా కూడా. శవ రాజకీయాలు చేయడంలో బులుగు మీడియా, పచ్చ మీడియా ఏ స్థాయిలో పోటీ పడతాయో, వెంగయ్య మరణంపై వచ్చిన కథనాలే నిదర్శనం.
కాగా, ‘వైసీపీ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా బలైపోయిన సామాన్యుడు.. ఓ కుటుంబానికి తండ్రి లేకుండా చేసిన వైసీపీ ఎమ్మెల్యే..’ అని వైసీపీ మీడియాలో కథనాలు రాయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి చురకలంటించడం గమనార్హం.
Share