ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైసీపీపై జనసేనాని ఫైర్: మీరెంత.? మీ బతుకెంత.?

‘హిట్లర్‌ని చూసింది ప్రపంచం.. ఉన్మాదుల్ని చూశాం.. వాళ్ళంతా ఆ తర్వాత ఏమైపోయారు.? వాళ్ళతో పోల్చితే మీరెంత.? మీ బతుకులెంత.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పంచాయితీ ఎన్నికల వేళ అధికార పార్టీ అరాచకాల్ని తట్టుకుని ధైర్యంగా జనసేన నిలబడిందనీ, బారతీయ జనతా పార్టీతో కలిసి మునిసిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతోందనీ, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చెబుతూ జనసేన అధినేత ఓ వీడియో విడుదల చేశారు.

ఆద్యంతం పవర్‌ఫుల్ డైలాగులతో సాగింది జనసేనాని ప్రసంగం ఈ వీడియోలో. ‘ఇది ప్రజల డబ్బు.. 100 శాతం మంది ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే డబ్బు ఖజానాకి చేరితే, ఆ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. అంటే, 100 శాతం మందికీ ఖజానా నుంచి ప్రయోజనం వుండాల్సిందే. అంతే తప్ప, మీ పార్టీకి చెందినవారికి, మీకు అనుకూలంగా పనిచేస్తున్నవారికి పంచిపెడతామంటే కుదరదు.

జనం రోడ్ల మీదకు వచ్చి తిరగబడే రోజుల్ని తెచ్చుకోవద్దు. అధికారులూ, అధికారంలో వున్నవారికి అనుకూలంగా పనిచేయడం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలి..’ అంటూ జనసేన అధినేత వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ముగిసేదాకా.. జనసేన అధినేత ఓ ‘టెంపో’తో ప్రసంగించడంతో.. ఒక్కో మాటా తూటాలా పేలింది.

‘ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ వుంది. పోటీ చేసినవారిపై దాడులు చేస్తారా.? వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఏకగ్రీవాలు చేస్తారా.? మీరు దాడులు చేసినా మా జనసైనికులు నిలబడ్డారు, తట్టుకున్నారు.. రక్తం చిందేలా మీరు కొట్టినా, నిలబడ్డాం గెలిచి చూపించాం..’ అని జనసేనాని వ్యాఖ్యానించారు. ‘ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. బీజేపీ మద్దతుతో..’ అని జనసేనాని స్పష్టం చేశారు.

మునిసిపల్ ఎన్నికల వేళ జనసేనాని వీడియో.. పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా, ‘మీరెంత మీ బతుకులెంత.?’ అని అధికార పార్టీని జనసేనాని ప్రశ్నించిన తీరుకి జనసైనికులే కాదు, సామాన్యులూ ఫిదా అవుతున్నారు.. చైతన్యవంతులవుతున్నారు.

Exit mobile version