కొత్తగా ఈ మధ్య వచ్చిన ట్రెండీ మార్పు ఏంటంటే, ‘మాకు ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం’ అని బెదిరించడం. చిత్రమేంటంటే, దీనికీ ఆద్యుడు చంద్రబాబే. నంద్యాల ఉప ఎన్నిక సందర్బంగా చంద్రబాబు వేసిన కొత్త ఎత్తుగడ అది. అచ్చం చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తోన్న వైసీపీ, పంచాయితీ ఎన్నికల్లో ఏం చేసిందో చూశాం. గెలవడం కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్.. చాలా చోట్ల గెలిచి, కొన్ని చోట్ల ఓడిపోయినా.. ఆ ఓడిన చోట్ల అరాచకం. మరీ హేయంగా, వృద్ధాప్య పెన్షన్లు కూడా తొలగించేశారాయె. ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే, మునిసిపల్ ఎన్నికల్లో ఓటర్లు భయపడకుండా వుంటారా.? దానికి తోడు, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. ఓటర్ల మీద అవాకులు చెవాకులు పేలింది.
ఓటర్లను చిన్నచూపు చూసింది. ఈ పరిస్థితుల్లో మార్పు వైపు కొందరు మాత్రమే అడుగులేయగలిగారు. పంచాయితీ ఎన్నికల్లో నిలబడ్డట్టే, మునిసిపల్ ఎన్నికల కోసం కూడా జనసేన ధైర్యంగా నిలబడింది. కానీ, ఎక్కువమంది ఓటర్లలో చైతన్యం తీసుకురాలేకపోయింది. ‘బెదిరింపులకు పాల్పడి విజయం సాధించారు..’ అని జనసేన అన్న మాటల్లో నిజం లేకపోలేదు. అదే నిజం.
ఎదిరించేవాడు లేనంతకాలం బెదిరించేవాడిదే రాజ్యం. ప్రజల్లోంచే నాయకులు పుట్టాలి.. ఓ బలమైన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే నాయకత్వం అవసరం కదా. అయితే, అధికార పార్టీ బెదిరింపుల పర్వం.. మార్పు కోరుకునే నాయకత్వానికి శాపంగా మారుతోంది. కానీ, ఈ బెదిరింపులు ఎన్నాళ్ళు.? అదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.