పశ్చమగోదావరి జిల్లాలో జనసేన గెల్చుకున్న పంచాయితీలో అధికార వైసీపీ అరాచకం నేపథ్యంలో జనసేనాని ఓ వీడియో ఫుటేజ్ విడుదల చేసి ఊరుకున్నారు. సరిపోదు, ఈ డోసు అస్సలు సరిపోదు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెరగాలంటే, ఇంతకు మించి జనసేన అధినేత చాలా చెయ్యాలి.. జనంలోనే వుండాలి. భీమవరం గనుక పవన్ కళ్యాణ్ వెళ్ళి వుంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంకాస్త ఎక్కువ సీట్లు గెల్చుకునేదన్న అభిప్రాయం జనసైనికుల్లోనే వ్యక్తమవుతోంది. అయితే, రాజకీయాలు చాలా మారిపోయాయ్. అధికార పార్టీ ఓటర్ల ‘కడుపు మీద కొడ్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతున్న దరిమిలా, ప్రజలు ఇంకో ఆప్షన్ వైపు మొగ్గు చూపడం అంత తేలిక కాదు. అలాగని చూస్తూ ఊరుకుంటే పార్టీ ఎలా బలపడుతుంది.? తెలంగాణలో బీజేపీతో దాదాపు తెగతెంపులు అయిపోయినట్లే.
ఆంధ్రపదేశ్‌లో కూడా బీజేపీతో కలిసి నడవడం వల్ల జనసేనకు అదనంగా కలిగిన లాభమేమీ లేదని తేలిపోయింది. జనసేన వల్ల బీజేపీ లాభపడుతోంది తప్ప, బీజేపీ వల్ల జనసేనకు అస్సలు లాభం వుండడంలేదు. పైగా, బీజేపీ కారణంగా జనసేన నష్టపోతోంది. జనసేన క్యాడర్, బీజేపీతో సర్దుకుపోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత, 2024 ఎన్నికల కోసం వీలైనంత త్వరగా కీలక నిర్ణయం తీసుకుంటే, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం మరింత వేగంగా జరుగుతుంది. అలా జగరకపోతే.. ఆ తర్వాత మరో ఐదేళ్ళు పార్టీని నమ్ముకోవడం, పార్టీ కోసమే పనిచేయడం జనసైనికులకు అసాధ్యమే అవుతుందేమో.