ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జనసేన: జనసేన, బీజేపీకి బైబై చెప్పడం ఖాయమా?

గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. – ఇదీ తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ నేతలు జనసేన పట్ల అవలంభిస్తున్న వైఖరిని చూసిన తర్వాతే జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగానే తెలంగాణ బీజేపీ నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి పవన్ తో భేటీ అయి పరిస్థితి చక్కదిద్దింది. ఫలితంగా జనసేన శ్రేణులు బీజేపీకి అండగా నిలబడటంతోనే జీహెచ్ఎంసీలో దాదాపు 50 స్థానాలను కమలనాథులు సొంతం చేసుకున్నారు.

అయినప్పటికీ ఈ విషయంలో జనసేన పాత్రను చిన్నదిగా చేయడానికే తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జనసేనాని తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, పీవీ కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఒకరకంగా తెలంగాణ బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నట్టేననే సంకేతాలిచ్చారు. అయితే, ఈ పంచాయతీ కేవలం తెలంగాణకే పరిమితం చేస్తారా.. లేక ఏపీలోనూ కమలనాథులను విడిచిపెడతారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

జనసే రాజకీయ ఆరంగేట్రం జరిగి సరిగ్గా ఏడేళ్లు పూర్తయింది. ఈ ఏడేళ్లలో జనసేన సాధించింది ఏమిటి అంటే.. అంతా శూన్యమే కనిపిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు లాభపడ్డాయి తప్ప.. జనసేనకు వారి వల్ల వీసమెత్తు లబ్ధి చేకూరలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. 2014లో బీజేపీ, టీడీపీకి జనసేన మద్దతుగా నిలవడంతోనే ఆ రెండు పార్టీలు ఏపీలో అధికారంలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేయడంతో అందరూ ఓటమి చవిచూశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పార్టీకి దూరంగా, అధికార పార్టీకి దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మరో ఐదేళ్లపాటు నడవాలంటే జాతీయ పార్టీ అండ అవసరమనే భావనతో పవన్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. కానీ దీనివల్ల జనసేనకు నష్టం తప్ప లాభం కలగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అటకెక్కించడంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరి ఆ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. పైగా విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పష్టంచేయడంతో ఏపీలో కమలనాథులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనపైనా పడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుని పోటీలో దిగి ఉంటే పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉండేది కాదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, సాధ్యమైనంత త్వరగా ఆ పార్టీకి బైబై చెప్పడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కటే కారణం కాదని.. ఏపీ బీజేపీలో కొందరు అధికార వైసీపీతో లాలూచీ పడి డబుల్ గేమ్ ఆడుతుండటం కూడా మరో కారణమని అంటున్నారు. ఏపీలో బీజేపీ కేవలం నలుగురి చేతుల్లోనే ఉందని.. వారు పగలు వైసీపీపై విమర్శలు చేసి, సాయంత్రం వారితో టచ్ లో ఉంటున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికారపార్టీ పోరాటం జరపలేని పార్టీతో తాము పొత్తు పెట్టుకుని సాధించేది ఏముందని పలువురు జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ రెండూ తమ వల్ల లబ్ధి పొందాయని.. ఆ పార్టీలతో పొత్తు వల్ల జనసేనకు ఎలాంటి లాభం చేకూరకపోగా, ఇప్పుడు నష్టమే ఎక్కువగా జరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరితో ఎలాంటి పొత్తూ లేకుండా నేరుగా యుద్ధరంగంలోకి మనమే దిగుదామనే సంకేతాలను జనసేన అధినాయకత్వానికి పంపిస్తున్నారు. తెలంగాణలో పీవీ కుమార్తె వాణీదేవికి మద్దతిస్తామంటూ తెలంగాణ విభాగం చేసిన ప్రతిపాదనను గౌరవించిన జనసేనాని.. ఏపీ బీజేపీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల ఒరిగేది ఏమీ లేదని.. పైగా లాభం కంటే నష్టమే ఎక్కువని పార్టీ నేతలు, శ్రేణులు కుండబద్దలు కొడుతున్న ప్రస్తుత తరుణంలో జనసేనాని నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. మరి పవన్.. ఈ పొత్తులకు బైబై చెప్పి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారా లేదా అనేది తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

Exit mobile version