‘కరోనా వైరస్ ఫ్రెండ్లీ..’ అంటూ అధికార పక్షంపై జనసేనాని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నిజమే, కరోనా వైరస్ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్నది నిర్వివాదాంశం. చిత్తూరు జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸ అత్యుత్సాహం, చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్ని రెడ్ జోన్‌లోకి నెట్టివేసిన విషయం విదితమే. సదరు ప్రజా ప్రతినిది¸కి న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది కూడా. మరో నలుగురు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులకూ నోటీసులు వెళ్ళాయి.
ఇదిలా వుంటే, కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్‌ని పాటించాలని చెబుతున్న ప్రభుత్వమే, మద్యం దుకాణాల్ని తెరవడం శోచనీయం. 40 రోజులకు పైగా మూసివున్న దుకాణాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో, మందుబాబులు పోటెత్తారు. విచక్షణ మర్చిపోయారు. వారిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యంత హేయంగా, ప్రభుత్వ టీచర్లకు మద్యం షాపుల వద్ద ‘కరోనా డ్యూటీలు’ వేయడం గమనార్హం. వ్యవస్థల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధిని ఈ ఘటన చెప్పకనే చెబుతుంది. రాష్ట్రంలో నిన్న మద్యం షాపుల వద్ద కన్పించిన క్యూ లైన్లు, తోపులాటలు చూస్తే.. వీళ్ళంతా కరోనా వాహకులుగా మారి, రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేయడం ఖాయమన్న భావన కలగకుండా వుండదు.
నలభై రోజులు ఆగిన మందుబాబుల్ని మరికొన్ని రోజులు అలాగే ఆపాల్సిన ప్రభుత్వం, ఖజానా నింపుకోవడం కోసం మద్యం దుకాణాల్ని తెరవడమంటే.. రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నట్లు.? ఇదే విషయాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు. భారత మాజీ ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఆత్మ ఘోషిస్తుందనీ, టీచర్లను లిక్కర్ షాపుల వద్ద కాపలా పెట్టడమేంటన్న జనసేనాని ప్రశ్నలో నూటికి నూరుపాళ్ళూ నిజాయితీ కన్పిస్తోంది.. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను చెప్పకనే చెబుతోంది.