ముంపు ప్రాంతాల్లో బాధితుల వెతల్ని జనసైనికులు ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. తాజాగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, ముంపు ప్రాంతాల ప్రజల వెతల్ని తెలుసుకున్నారు.. అధినేత ముందు ఆ విషయాల్ని నివేదిక రూపంలో వుంచారు. పునరావాసం కల్పించకుండా బాధితుల ఇళ్ళను కూల్చేస్తున్నారనీ, బాధితుల ఇళ్ళకు విద్యుత్ సౌకర్యాన్ని తొలగిస్తున్నారనీ, ఈ అంశాలు తనను తీవ్రంగా కలచివేశాయని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. మానవ హక్కుల్ని హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమన్న పవన్ కళ్యాణ్, బాధితుల వెతలపై మానవ హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేస్తామని జనసేన అధినేత హెచ్చరించారు.
వెంటనే, ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలనీ, పునరావాసం కోసం నిర్మించిన ఇళ్ళు కాలనీల వద్ద మౌళిక వసతులు కల్పించాలనీ, నాసిరకం ఇళ్ళ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు. బాధితుల వెతలపై స్పందిస్తున్న జనసేన నేతలు, జనసైనికుల్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ముంపు బాధితులకు 10 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని గతంలో చెప్పిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక 6.8 లక్షలతో సరిపెడుతుండమేంటని జనసేన అధినేత ప్రశ్నించారు.