ఏపీలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ఔషధాలు అందక ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఆక్సిజన్ అందించలేనంత పరిస్థితి ఎందుకు వస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా మృతుల లెక్కలు దాయగలరని.. వారి కుటుంబాల కన్నీళ్లను అడ్డుకోలేరని అన్నారు. ఆక్సిజన్ అందక, బెడ్లు లేక బాధితులు ప్రాణాలు కోల్పోవడం బాధిస్తోందని అన్నారు.
ఏపీ మరో రోమ్.. పాలకులు నీరో వారసులు కాకూడదని అన్నారు. రెమిడిసివర్ ఇంజెక్షన్ 40వేలకు అమ్ముతుంటే సామాన్యులు, పేదలు ఎలా ప్రాణాలు కాపాడుకోగలరని ప్రశ్నించారు. వేలల్లో ఆంబులెన్సులు ప్రవేశపెట్టామని గొప్పగా చెప్తున్న ప్రభుత్వం బాధితులను ఆస్పత్రులకు మాత్రం తరలించలట్లేదని అన్నారు. ఇంటింటికీ కావాల్సింది మేకలు, ఇంటర్నెట్ మాత్రమే కాదని.. ఆక్సిజన్, మందులు అన్నారు. రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్ కొరత తీర్చేలా సీఎం జగన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలని కోరారు.