ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ కోసం #PSPKRana లో త్రివిక్రమ్ చేసిన మార్పులు ఇవేనా..?

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా ‘అయ్యప్పయున్ కోషియమ్’ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ – రిటైర్డ్ హవల్దార్ మధ్య అహం ఆత్మాభిమానం కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసున్నాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ స్క్రిప్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎమోషన్స్ మిస్ అవ్వకూడదని మూల కథని గానీ.. అందులోని పాత్రల్లో కానీ ముట్టుకోలేదట. కాకపోతే పవన్ కోసం మాతృకలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కొత్తగా జత చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఎలివేషన్ సీన్స్ ని ప్రత్యేకంగా రాసుకున్న త్రివిక్రమ్.. హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నట్లు టాక్.

ముఖ్యంగా తెలుగులో నిడివి బాగా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అయ్యప్పయున్ కోషియమ్’ సినిమా నిడివి సుమారు 3 గంటలు ఉంటుంది. ఇప్పుడు తెలుగు సెన్సిబిలిటీస్ కి నేటివిటికి తగ్గట్లు మార్చే క్రమంలో సినిమా లెన్త్ ని తగ్గిస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగే ఫైట్ ని సినిమా అంతటా క్యారీ చేసేలా పవర్ ఫుల్ డైలాగ్స్ ని త్రివిక్రమ్ రాసినట్లు తెలుస్తోంది. మిగిలిన అంశాలన్నీ మలయాళ వెర్సన్ లోనివే ఫాలో అయ్యారని టాక్.

ఇకపోతే మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన పాత్రలో రానా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే మేకింగ్ వీడియోని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. పవన్ భీమ్లా నాయక్ లుక్ ని రివీల్ చేశారు. అలానే లీకైన వీడియో వల్ల రానా లుక్ కూడా బయటకు వచ్చింది.

‘ఏకే’ రీమేక్ కు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ ఇందులో పవన్ కళ్యాణ్ తో ఓ ఫోక్ సాంగ్ కూడా పాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇది వరకే వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ముందుగా ప్రసాద్ మూరెళ్ళ ను తీసుకోగా.. ఇప్పుడు ఆయన స్థానంలో రవి కె చంద్రన్ వచ్చి చేరారు. ఏఎస్ ప్రకాష్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 12 గా ఈ సినిమా రూపొందుతోంది. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న #’PSPKRana’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘గోపాల గోపాల’ ‘అజ్ఞాతవాసి’ సినిమాల తర్వాత ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అవుతున్న పవన్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. పవన్ – రానా లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే సీన్స్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – సాగర్ చంద్ర కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version