Pawan Kalyan: ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు మీడియా చాలావరకు రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ వార్తని ‘కవర్’ చేస్తే ఏ పార్టీకి కోపం వస్తుందోనని ఆయా పార్టీలకు చెందిన మీడియా సంస్థలు తెగ ఆందోళన చెందుతుండడం వల్ల, అసలు సిసలు సమస్యలకు ‘కవరేజీ’ దక్కడంలేదు. హైద్రాబాద్‌లో చిన్నారి చైత్ర హత్యాచారానికి గురైన ఘటనని మీడియా ‘తొక్కిపెట్టే’ ప్రయత్నం చేసింది.
ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారనే వార్త బయటకొచ్చిందో.. ఆ తర్వాత మీడియా హంగామా షురూ అయ్యింది. మరోపక్క, సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా దిక్కుమాలిన పాత్రికేయంపై నిప్పులు చెరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియా మింగలేక కక్కలేక.. అన్నట్టు నానా తంటాలూ పడుతోంది. మెరుగైన సమాజం కోసం.. అని చెప్పుకునే బురద ఛానల్ అయితే, హత్యాచారం జరిగింది చిన్నారిపైన గనుక.. తాము ఆ వార్తను కవర్ చేసే విషయంలో సంయమనం పాటించామని ‘కవరింగ్’ కథనాన్ని తెరపైకి తెచ్చింది.
ఇలాంటి ఎన్నో ఘటనల విషయంలో చెయ్యకూడని ఓవరాక్షన్ సదరు బురద ఛానల్ చేసిన విషయాన్ని ఎలా విస్మరించగలం. ‘అనవసర విషయాలపై అత్యుత్సాహం చూపుతున్న మీడియా, ఇలాంటి ఘటనలపై స్పందించకపోవడం శోచనీయం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేసిన విమర్శ తర్వాత, సదరు బురద ఛానల్ ఉలిక్కిపడాల్సి వచ్చింది. పవన్ తమను విమర్శించిన వైనాన్ని పైకి చెప్పుకోలేక, చిన్నారి చైత్రపై హత్యాచారం ఘటన మీద ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఆ కార్యక్రమంలోనే తమ గోడు వెల్లబోసుకుంది ఆ బురద ఛానల్.
ఇందుకే, ఇలాంటి సందర్భాల్లోనే రెస్ట్ ఇన్ పీస్ మీడియా.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైతే, బైక్ డిజైనింగ్ మీద విశ్లేషణలతో సహా హోరెత్తించేసింది సదరు బురద ఛానల్. అంతేనా, బైక్ స్పీడ్ ప్రమాద సమయంలో గంటకు 400 కిలోమీటర్లనీ సెలవిచ్చింది. చిన్నారులపై హత్యాచారాలు సహా వృద్ధులపైనా హత్యాచారాలు.. వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి.. ప్రభుత్వాల్ని నిలదీసే ధైర్యం లేని బురద ఛానల్.. మెరుగైన సమాజం కోసం.. అని చెప్పుకోవడం మానేస్తే మంచిది.