ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ నేతలకు సంబంధించిన ట్వీట్లను జనసేనాని ట్వీట్‌ చేస్తుండడంపై జనసైనికుల్లోనూ కొంత అసహనం వ్యక్తమవుతున్నప్పటికీ, కీలక విషయాలపై జనసేనాని సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్న తీరు, ఈ క్రమంలో ప్రముఖ నేతల ట్వీట్లను ప్రస్తావిస్తుండడం అభినందించాల్సిన విషయమే.

తాజాగా టీటీడీ భూముల వేలం వ్యవహారంపై జనసేనాని వరుస పెట్టి ట్వీట్లతో హోరెత్తించేశారు. ఇంకేముంది.? జనసైనికుల్లో ఫుల్‌ జోష్‌ నెలకొంది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయిపోయింది. మామూలుగానే పవన్‌ అభిమానులు, నిత్యం తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ట్రెండింగ్‌లో వుంచుతుంటారు. అలాంటిది, అత్యంత కీలకమైన అంశంపై తమ అధినేత ట్వీటేస్తే.. దాన్ని ఏ స్థాయి ట్రెండింగ్‌లోకి తీసుకెళ్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

జనసేనాని ట్వీట్‌ నేపథ్యంలో మంచు మనోజ్‌ కూడా స్పందించాడు. మరికొందరు సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంపై స్పందించాలని వున్నా, ‘రాజకీయ రచ్చ ఎందుకు’ అన్న కోణంలో మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో జనసేనాని సంయమనం పాటిస్తున్నారు. తాను సంయమనం పాటించడమే కాదు, జనసైనికులూ గ్రౌండ్‌ లెవల్‌లో సంయమనం పాటించేలా చూసుకుంటున్నారు.

చిన్న చిన్న విషయాలకే కేసులు నమోదు చేసేలా ప్రభుత్వం, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్న దరిమిలా, జనసైనికులెవరూ సంయమనం కోల్పోవద్దని జనసేనాని సూచిస్తున్నారు. అయితే, కొందరు జనసైనికులు మాత్రం ‘అన్నిటికీ తెగించే వున్నాం..’ అన్నట్టుగా తాము చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

టీటీడీ విషయంలో వైఎస్‌ జగన్‌ గతంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారన్నది సవివరంగా జనసైనికులు ప్రస్తావిస్తున్నారు సోషల్‌ మీడియాలో. సదావర్తి భూముల విషయంలో వైఎస్‌ జగన్‌ చేసిన యాగీని ఉదహరిస్తూ.. అప్పుడు నీతులు, ఇప్పుడేమో వేలం పాటలా.? అంటూ జనసైనికులు నిలదీస్తున్నారు.

మొత్తమ్మీద, జనసేనాని ట్వీట్ల పరంపర అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపిందన్నమాట. అయితే, ఈ డోస్‌ సరిపోదు.. ప్రత్యక్ష పోరులోకి జనసేనాని దిగాల్సి వుంది. కరోనా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వస్తున్న దరిమిలా, జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిందే. అయితే, ఇంకా కొంత కాలం సోషల్‌ డిస్టెన్సింగ్‌ తప్పదు గనుక.. ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాల్సి వస్తే.. జనసేనాని చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, పవన్‌ ఎక్కడుంటే అక్కడ జనసముద్రమే కదా.!

Exit mobile version