ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ కళ్యాణ్ గోదారి రాజకీయం: పవర్ ఫుల్ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్ల గురించి, ఆ రోడ్లపై ప్రయాణించే వారి నరక యాతన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక నరకం. రెండున్నరేళ్లుగా రోడ్లని ప్రభుత్వం వదిలేసింది. ప్రజల ప్రయాణ వెతల్ని పట్టించుకోవడం మానేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసి అయినా రోడ్లని బాగు చేయాలని సంకల్పించుకోవడంతో, అధికార వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది.

ఎక్కడికక్కడ జనసేన నేతల్నీ, జన సైనికుల్ని అరెస్టులు చేసింది. గృహ నిర్భంధాలు చేసింది. కానీ, జన ప్రవాహాన్నిఆపడం ఎవరి తరమూ కాదని పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిరూపించింది.

తూర్పు గోదావరి జిల్లానే పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకున్నారు. ఎందుకంటే, అక్కడ రాజకీయంగా కొంత బాకీ తీర్చుకోవల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, గతంలో పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జనసేన నిరసన వ్యక్తం చేస్తే, వైసీపీ గూండాలు దాష్టీకానికి దిగారు. ఆ జిల్లాలో జన సునామీ ఎలా ఉంటుందో పవన్ చూపించారు.

సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంటూ నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ స్పీచ్‌కి అడ్డం తగిలారు కానీ, లేదంటే పవన్ ప్రసంగం ఇంకో స్థాయిలో ఉండేది. జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ ఉత్తేజ పరిచే ప్రయత్నం చేశారు. ఆ సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయ పరిస్థితిని అర్ధం చేసుకోవల్సిందిగా కోరారు. రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రసంగం ఖచ్చితంగా చర్చనీయాంశమవుతుంది.

రెండు జిల్లాల్నీ కలిపే ధవళేశ్వరం బ్యారేజీపై జరగాల్సిన కార్యక్రమమిది. తెలుగు నాట రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించేలా జనసేనాని, రోడ్లపై శ్రమదానం పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చారు. దాష్టీకాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల నుంచి ప్రజల్ని రక్షించాలని కోరారు.

అదే సమయంలో రాజకీయ వ్యవస్థ ఎంతలా పోలీస్ వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నదీ వివరించారు. పోలీసుల ఆవేదనను ఓ కానిస్టేబుల్ కొడుకుగా అర్ధం చేసుకోగలను.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీఆలోచింపచేస్తున్నాయి. మొత్తమ్మీద గోదారి కేంద్రంగా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం తనదైన రాజకీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టారని అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version