జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో’ అంటూ ఓ పేపర్‌ని చింపి పారేశారు.. నిన్నటి నర్సాపురం బహిరంగ సభ సాక్షిగా. ‘ఆయన చింపేస్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేముంటుంది.? అలా చించెయ్యడం అవివేకం..’ అంటూ సహజంగానే అధికార పార్టీ నుంచి ‘గగ్లోలు’ షురూ అయ్యింది.
నిన్న పవన్ కళ్యాణ్ చాలా అంశాల్ని చాలా చాలా సీరియస్‌గా ప్రస్తావించారు. అన్నిటిలోకీ అతి ముఖ్యమైనది, లేని సమస్యను సృష్టించి, ఆ సమస్యకు పరిష్కారమంటూ సమాజంలోని ఆయా వర్గాల ప్రజల్ని తమ దారికి తెచ్చుకోవడం ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్న వింత అని.
తెలుగు సినీ పరిశ్రమకు లేని సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటగట్టింది. రాజధాని విషయంలోనూ లేని సమస్యను వైఎస్ జగన్ సర్కారు అంటగట్టింది. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్. వాలంటీర్ వ్యవస్థ సహా చెప్పుకుంటూ పోతే ఇలాంటివే అన్నీ. అంతెందుకు, మొన్నటికి మొన్న ఉద్యోగుల సమస్య కూడా అలాంటిదే కదా.!
అందుకే, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా వ్యతిరేక జీవోలు కావొచ్చు, చట్టాలు కావొచ్చు.. వాటిని లెక్క చేయాల్సిన పని లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘జీవోని చింపేస్తున్నా.. మీకు చేతనైతే నన్ను అరెస్టు చేసుకోండి.’ అంటూ జనసేనాని సవాల్ విసిరిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కక్ష పూరితంగా జగన్ సర్కారు వ్యవహరించిన తీరు చూశాక కూడా, ‘భీమ్లానాయక్’ సినిమాకి ముందర పవన్ కళ్యాణ్ ఇంతటి ధైర్యమెలా చేశారు. ‘వాళ్ళకి భయం లేదు..’ అని పదే పదే వైసీపీ మీద విమర్శలు చేస్తుంటారు పవన్. కానీ, భయం లేనిది పవన్ కళ్యాణ్‌కే.! అందుకే, ఆయన దేహీ అని ప్రభుత్వాన్ని అడుక్కోరు.!