ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే.. బులుగు నేతల పరిస్థితేంటి.?

ఎప్పుడన్నా సినిమా థియేటర్ల వద్ద పోలీసులు కాపలా కాయడం చూశామా.? సినిమా థియేటర్లలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హంగామా కనిపించిందా.? అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల సందర్భంగా కనిపించాయి. అన్ని చోట్లా అని కాదుగానీ, చాలా చోట్ల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నిర్దేశిత సమయానికంటే ముందు సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. టిక్కెట్ల ధరల్ని పెంచడానికి వీల్లేకుండా చేశారు అధికారులు. ఐదు రూపాయల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమయ్యాయి.

దాంతో, ‘మేం థియేటర్లను ఈ టిక్కెట్ ధరలతో నడపలేం.. ఆ కారణంగా భీమ్లానాయక్ సినిమాని ప్రదర్శించలేం..’ అని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ చెబుతూ, ఆవేదనా భరితమైన రీతిలో బోర్డులు పెట్టేయాల్సి వచ్చింది.

ఇంతకీ, ఇలా ‘భీమ్లానాయక్’ సినిమాపై ఆంక్షలు విధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిందేంటి.? ఏమీ లేదు. సినిమాని ప్రేక్షకులు చూడటం మానేశారా.! లేదాయె.! పోటెత్తారు ప్రేక్షకులు ‘భీమ్లానాయక్’ సినిమాని తొలి రోజు చూసేందుకు.

రాత్రి నుంచి భీమ్లానాయక్ హంగామా కొనసాగుతూనే వుంది.! ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులే కాదు, సామాన్యులూ నినదించే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రేక్షకులకు సమాధానమివ్వలేక అధికారులు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.

బెనిఫిట్ షోల కోసం సినీ అభిమానులు పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెట్టారు. యానాంలో అయితే రోడ్లు కిక్కిరిసిపోయాయి రాత్రంతా.

ఓ సినిమా హీరో మీద, అతని సినిమాల మీద ఇన్ని ఆంక్షలా.? ఇతర హీరోల సినిమాలకు లేని ఆంక్షలు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు.? అధికారం చేతిలో వుంటే రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టొచ్చని అనుకుంటే ఎలా.? అన్నది రాజకీయ విశ్లేషకులు సైతం సంధిస్తున్న ప్రశ్న.

ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే.. ఆయనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగితే, ఇప్పుడు అధికారంలో వున్నవారి పరిస్థితి.. అప్పుడెలా వుంటుందో ఏమో.!

Exit mobile version