ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ లక్ష్యం జేపీనా? కేజ్రీవాలా?

భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందన్న మాట పెద్ద వారి నోట తరచూ వస్తుంటుంది. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోరు. వారి మాటల్లోని మర్మాన్ని గుర్తించేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. నిజాయితీగా ఉండటం మంచిదే. ఉత్త నిజాయితీకి ప్రజలు నీరాజనాలేమీ అర్పించరు. ఆ మాటకు వస్తే అధికారాన్ని కూడా ఇవ్వరు. ఇవ్వలేదని బాధ పడరు కూడా. చూస్తుంటే..జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నిజాయితీని తరచూ ప్రదర్శించుకునే అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిదేమో?

అదేం దరిద్రమో కానీ.. సినిమాల్లో తమ వారిని లాంఛ్ చేసే విషయంలో పక్కా ప్లానింగ్ తో వ్యవహరించే మెగా ఫ్యామిలీ.. రాజకీయాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. రాజకీయాలంటేనే మురికి గుంట.. దిగిన వెంటనే.. అంటుకునేదే బురద. దాన్ని అంటించుకోకుండా.. ప్రత్యర్థుల మీద చతురతతో విసిరే నైపుణ్యం మెగా కాంపౌండ్ కు తక్కువే. ఈ కారణంతోనే మంచివాడన్న పేరున్న చిరంజీవి అందరివాడు కాకుండా కొందరివాడయ్యాడు.

పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. మొదట్నించి అతని తీరుపై ఎవో ఒక విమర్శలు.. వేలెత్తి చూపించటాలు ఉన్నాయి. అయినప్పటికీ అతడంటే ప్రాణం ఇచ్చే అభిమానులు.. ఆయన మాటల కోసం.. ఆయన చూపు కోసం పిచ్చెక్కిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. తెలుగు నేల మీద ఒక పేరు పక్కన ‘ఇజం’ అంటూ అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పాలి.

అలాంటి పీకే.. పాలిటిక్స్ లోకి అడుగు పెట్టిన కొద్దికాలానికే ఎలాంటి నిందలు.. మరెలాంటి కామెడీ మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను.. తన క్యారెక్టర్ ను బద్నాం చేసే విషయంలో కర్కశంగా వ్యవహరించే రాజకీయ శక్తుల్ని సరిగా అర్థం చేసుకోవటంలో పవన్ పొరపాటు చేస్తున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎవరిదాకానో ఎందుకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం? తన పొలిటికల్ కెరీర్ లో తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక్కసారైనా పొగడటం చూశామా? ఏదైనా మంచిపని చేసినప్పుడు పొగడాల్సిన అవసరం లేదు. అలా అని తిట్టాల్సిన అవసరం లేదు. కామ్ గా ఉంటే సరిపోతుంది.

నేను నిజాయితీగా ఉంటాను. ముక్కుసూటిగా మాట్లాడతాను. నాకు సమర్థత ఉంది. అశ్రిత పక్షపాతం లేదు.. ప్రజలకు కీడు చేసే ఏ పని చేయనని అనుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ క్రమంలో ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయం చాలా కీలకం. ఇలాంటి వాటి విషయంలో తప్పులు దొర్లితే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది.వైఎస్ హయాంలో జయప్రకాశ్ నారాయణ అలియాస్ జేపీ లోక్ సత్తా పార్టీ పెట్టారు. తెలుగు నేతల మీద జేపీ లాంటి క్లీన్ చిట్ అధినేతలు అస్సలు కనిపించరు. చాలామంది సెలబ్రిటీలు జేపీకి ఫ్యాన్స్ గా ఉండటమే కాదు.. ఆయనకు తోడుగా నిలిచారు. ఓటేయటానికి సంసిద్ధత ప్రదర్శించారు. కానీ.. రాజకీయాల్లో క్లీన్ గా ఉండే అవసరం కన్నా.. అధికారాన్ని హస్తగతం చేసుకునే తీర్పు.. నేర్పుచాలా అవసరం.

ఇక్కడే జేపీ బొక్కొబోర్లా పడ్దారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం 2024 నాటికి జాతీయస్థాయిలో తమ పార్టీ వెలిగిపోతుందని.. అధికారం చేజిక్కించుకునేలా ప్లాన్ చేశామని ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. తర్వాత ఏమైందో అందరికి తెలిసిందే. అదే సమయంలో ఉద్యమకారుడిగా తెర మీదకు వచ్చిన కేజ్రీవాల్ సంగతి చూశాం. లక్ష్యం దిశగా అడుగులు వేసే క్రమంలో.. దేనికైనా సరే అన్నట్లుగా వ్యవహరించే నేర్పు ఉండాలి. అంతేకానీ.. తాను గీసుకున్న చట్రంలో పరిమితమైన జేపీ లాంటి వారు ఇప్పుడెక్కడ ఉన్నారో తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన మంచిపనుల్ని కీర్తించటం పవన్ గొప్ప మనసును చెప్పొచ్చు.కానీ.. ఇప్పటి రాజకీయాలకు అలాంటి అనవసర మంచితనంతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. లక్ష్యాన్ని చేరుకునేందుకు జేపీ.. కేజ్రీవాల్ ప్రయత్నించిన వారే. అందుకు వారు అనుసరించిన వ్యూహాలు వేర్వేరు. మరి.. పవన్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారన్నది ఆయనకే వదిలేయటం మంచిది.

Exit mobile version