అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టు ‘వకీల్‌సాబ్’ పవన్‌కల్యాణ్ తీరిగ్గా ఇప్పుడొచ్చాడు. రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయమంటూ బీరాలు పలుకుతున్నాడు. అమరావతి రైతుల పోరాటానికి తన సంఘీభావం తెలిపాడు. రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలు త్యాగం చేశారని, రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే అన్నాడు. రాజధాని రైతులు, మహిళలకు జనసేన మద్దతు ఉంటుందన్నాడు.
రాజకీయాల్లో పార్ట్‌టైం, సినిమాల్లో ఫుల్‌టైం పనిచేస్తున్న పవన్‌కల్యాణ్‌కి రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి రెండు రోజుల సమయం పట్టింది. బహుశా సినిమా పనుల్లో ఉన్న పవన్‌కు అసలు రాజధాని పోరాటం 200 రోజులకు చేరిందనే విషయం ఇప్పుడే తెలిసినట్టుంది. అందుకే ఆయన హడావుడిగా రెండుమాటలు చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనా దెబ్బతో ఇంటికి పరిమితమైన రాజధాని రైతుల పోరాటం గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఒక్క టీడీపీకి, దాని వంత పాడుతున్న జనసేనకే చెల్లింది. ప్రశ్నించడానికే వచ్చానంటూ టీడీపీ నీడలా నడిచే జనసేన స్వతంత్రంగా వ్యవహరించాలని, మున్ముందు వ్యవహరిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది.