తమ హీరోలకు సంబంధించి ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం ఈ మధ్య అభిమానులకు ఫ్యాషన్ అయిపోయింది. దానికొక సమయం సందర్భం అని కూడా చూడట్లేదు. ఒక సినిమా రిలీజ్ సందర్భంగానో.. లేదంటే వార్షికోత్సవానికో లేదంటే హీరో పుట్టిన రోజుకో ట్రెండ్ చేస్తే ఒక అర్థం ఉంది. కానీ హీరో పుట్టిన రోజుకు 50, 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని ట్రెండ్ చేయడం.. హీరో బర్త్ డే సీడీపీ గురించి హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. బర్త్ డే మంత్ అని ట్రెండ్ చేయడం.. ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు అభిమానులు.
ఈ గోలలో ఇప్పటిదాకా కొందరు స్టార్ల అభిమానులే ఉన్నారు. వారి వెనుక ఆయా హీరోలు, వారి పీఆర్వోల ప్రోద్బలం కూడా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాంటివి అసలు పట్టించుకోని, ఇష్టపడని పవన్ కళ్యాణ్ మీద కూడా తన ఫ్యాన్స్ ఇలాంటి ట్రెండ్స్ కోసం ఉబలాటపడిపోతున్నారు. రెండు నెలల కిందట ‘గబ్బర్ సింగ్’ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రెండ్ చేశారు, రికార్డు కొట్టారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పవన్ పుట్టిన రోజుకు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి ట్విట్టర్లో రచ్చ చేస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. కానీ ఇలాంటి వాటితో వీళ్లు సాధించేదేంటన్నది ప్రశ్నార్థకం.