‘‘చిన్నతనంలో నా పుట్టిన రోజుకు ఒకట్రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు. తర్వాత అలాంటివన్నీ పక్కన పెట్టేశాను. ఒక దశ దాటాక నా పుట్టిన రోజును నేనే కాక మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవాళ్లు. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాణ్ని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చాక స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేయాలని చూసినా ఇబ్బందిగా అనిపించేది. కేక్ కట్ చేయడం.. వాళ్లు నా నోట్లో కేక్ పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే పూర్తిగా మానేశాను. ఇక అభిమానుల విషయానికి వస్తే నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం, నా పుట్టిన రోజు వేడుకలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారు. అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది’’ అని పవన్ పేర్కొన్నాడు.