ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అప్పుడు సగటు అభిమాని.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్

వెంకీ కుడుముల.. రెండే రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన కుర్రాడు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడతను. కానీ ఆ సినిమా విజయం గాలి వాటం అని, దాని పూర్తి క్రెడిట్ అతడిది కాదు అన్న వాళ్లకు ‘భీష్మ’తో తనేంటో రుజువు చేశాడు. ‘భీష్మ’ను ఓ భారీ చిత్రంలా, నితిన్‌ను ఒక పెద్ద స్టార్‌లా చూపించి.. టాలీవుడ్ టాప్ స్టార్స్ తన వైపు చూసేలా చూశాడు.

ఇప్పుడు అతడితో సినిమా చేయడానికి రామ్ చరణ్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రాగా.. ఆయనకు తన అభిమానంతా కూడగట్టి శుభాకాంక్షలు చెప్పాడు వెంకీ. పవన్ సినిమాల ద్వారా తాను ఎంతగా ప్రభావితమైంది అతను వివరించాడు. బదులుగా పవన్ కళ్యాణ్ అతడికి ఆత్మీయంగా కృతజ్ఞతలు చెప్పాడు. ‘భీష్మ’ లాంటి మరిన్ని సినిమాలు చేయాలని అభిలషించాడు.

ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ఓ విషయం ఏంటంటే.. 12 ఏళ్ల కిందట వెంకీ ఒక మామూలు కుర్రాడు. అప్పటి యూత్‌లో చాలామందిలాగే పవన్ కళ్యాణ్‌కు అతను వీరాభిమాని. కొత్త సినిమాలు రిలీజైనపుడు థియేటర్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకులను మీడియా వాళ్లు మైకు పెట్టి సినిమా ఎలా ఉందని అడిగితే.. ఆ హీరో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతూ తమ హీరోను పొగుడుతారు, సినిమా బ్లాక్‌బస్టర్ అంటుంటారన్న సంగతి తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ‘జల్సా’ సినిమా చూసి బయటికి వచ్చిన ఒక సాధారణ పవన్ కళ్యాణ్ అభిమానిగా విపరీతమైన ఎగ్జైట్మెంట్‌తో మాట్లాడాడు.

‘‘నేను ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట అనే మారుమూల గ్రామం నుంచి వచ్చా. ‘జల్సా’ సినిమా పాటలు విని ఇప్పటికే గాల్లో తేలిపోతున్నాం. ఇక సినిమా అయితే గ్యారెంటీగా జనాల గుండెల్లో నిలిచిపోతుంది. దేనికైనా సరే పవన్ కళ్యాణ్ రాక్స్. గన్ను పట్టాలన్నా పవన్ కళ్యాణ్, పెన్ను పట్టాలన్నా పవన్ కళ్యాణ్, డ్యాన్స్ వెయ్యాలన్నా పవన్ కళ్యాణ్. డ్రెస్సు వెయ్యాలన్నా పవన్ కళ్యాణ్. ఏది చెయ్యాలన్నా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆంధ్రా’’ అంటూ ఒక సగటు అభిమానిలా మాట్లాడాడు వెంకీ అప్పుడు. కట్ చేస్తే.. తర్వాత పవన్ మిత్రుడైన త్రివిక్రమ్ దగ్గర శిష్యరికం చేశాడు.

‘ఛలో’ దర్శకుడిగా తొలి విజయాన్నందుకున్నాడు. రెండో సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాడు. పవన్ నుంచి సైతం ప్రశంసలందుకున్నాడు. పుష్కర కాలంలో ఒక సాధారణ అభిమాని.. టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా ఎదగడం అనూహ్యం.

Exit mobile version