కాగా, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని జనసేన అధినేత ప్రశంసించడంతోపాటు, పార్టీలో వుంటూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని ‘ధైర్యంగా మీరు బయటకు పోవచ్చు..’ అంటూ అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. ‘పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పార్టీని జనంలోకి తీసుకెళ్ళాలనే అంకిత భావం వున్నవారు మాత్రమే పార్టీకి అవసరం. మిగతావాళ్ళు వీలైనంత త్వరగా పార్టీని వీడొచ్చు..’ అని జనసేన అధినేత తేల్చి చెప్పారు.
కరోనా నేపథ్యంలో కొన్ని నెలలుగా హైద్రాబాద్‌లోనే వుండిపోవాల్సి వచ్చినప్పటికీ, ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్‌లో వుంటున్న జనసేనాని, ప్రత్యక్షంగా అమరావతిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమై, దిశా నిర్దేశం చేశారు. అమరావతిపైన ఇంకోసారి స్పష్టత ఇచ్చిన జనసేనాని నోట జమిలి ఎన్నికల మాట రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జమిలి ఎన్నికల కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తోన్న విషయం విదితమే.
ఇదిలా వుంటే, జనంలోకి వెళ్ళేందుకు జనసేనాని కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన వెంటనే, పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయాలని జనసేనాని భావిస్తున్నారని సమాచారం. బస్సు యాత్రతోపాటుగా, పాదయాత్ర కూడా చేస్తే బావుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోందట.