ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇలాగైతే జనసేన ఓట్లు బీజేపీకి పడేదెలా.?

పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచన మేరకు, జనసేన నేతలు, జనసైనికులు గ్రౌండ్‌ లెవల్‌లో గట్టిగానే బీజేపీ తరఫున గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విషయం విదితమే. బీజేపీ అభ్యర్థులు కూడా, కింది స్థాయిలో జనసేన నేతలకీ, కార్యకర్తలకు సముచిత గౌరవం ఇస్తున్నారన్నది నిర్వివాదాంశం. కానీ, ఎంపీ అరవింద్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరుల వ్యాఖ్యల కారణంగా జనసేన – బీజేపీ మధ్య కొంత గందరగోళమైతే స్పష్టంగా కనిపిస్తోంది.

నిన్నటికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద్రాబాద్‌లో పర్యటిస్తే, ఆ పర్యటనకు పెద్దయెత్తున జనసైనికులు కూడా తరలి వెళ్ళారు. కానీ, ఇంతలోనే ఎంపీ అరవింద్‌, జనసేనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే, జనసేన భగ్గుమంది. ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అరవింద్‌కి అల్టిమేటం జారీ చేశారు తెలంగాణ జనసేన నాయకులు. మరోపక్క, గ్రౌండ్‌ లెవల్‌లో ఈ రోజు ఈక్వేషన్స్‌ మారిపోయాయి. నిన్న మొన్నటిదాకా బీజేపీ శ్రేణులతో సందడిగా ప్రచారంలో కనిపించిన జనసైనికులు, ఈ రోజు ప్రచారంలో చాలా చోట్ల చాలా పలచగా కన్పించారు. దాంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.. రెండు పార్టీల మధ్యా నెలకొన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ని తగ్గించేందుకు మరోమారు రంగంలోకి దిగక తప్పేలా కనిపించడంలేదు. అయితే, ప్రచారానికి చాలా తక్కువ సమయం వున్నందున, ఆయన ప్రయత్నాలు ఎంతవరకు పనిచేస్తాయి.? అన్నది ఆసక్తికరంగా మారింది.

పెద్ద నాయకుల స్థాయిలో వివాదాలు, కింది స్థాయిలో తమ కొంప ముంచుతున్నాయంటూ స్థానికంగా జనసేన అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట. తమకు పూర్తిస్థాయిలో మద్దతు కొనసాగించాలంటూ జనసేన నేతలు, జనసైనికుల చుట్టూ అభ్యర్థులు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు. ‘మేం సోలోగానే పోటీ చేస్తున్నాం.. మాకు ఎవరి మద్దతూ అవసరం లేదు’ అని అరవింద్‌ లాంటి నాయకులు చెబుతోంటే, గ్రౌండ్‌లో అభ్యర్థుల పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ఇలాగైతే, జనసేన ఓట్లు బీజేపీకి పడేదెలా.? అన్న ఆందోళన బీజేపీ అధినాయకత్వంలో కూడా వ్యక్తమవుతోందట.

Exit mobile version