ఇండస్ట్రీలో మెజారిటీ నిర్మాతలు నష్టాల పాలయ్యేలా ఉన్నారు. హీరోలకు కూడా పంచ్ పడేలా ఉంది. కరోనా అనంతర పరిస్థితుల్లో వాళ్లు పారితోషకాలు తగ్గించుకోక తప్పేలా లేదు. వాళ్ల డైరీలో కోట్ల విలువైన కాల్ షీట్లు వృథా అయిపోయాయి. రెండేళ్ల విరామం తీసుకుని లేక లేక సినిమా చేయడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్‌కు కూడా కరోనా గట్టి పంచే ఇచ్చింది. ఆయన ప్లానింగ్ కూడా తేడా కొట్టేసినట్లే అంటున్నారు.
2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కొంచెం ఆర్థికంగా బలం పుంజుకునేందుకు మళ్లీ సినిమాలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. అలాగని రాజకీయాలకు ఇబ్బంది రాకూడదని భావించి రెండేళ్ల పాటు ఇటు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే చకచకా నాలుగైదు సినిమాలు చేయాలనుకున్నాడు. 2021 చివర్లోపే చేయాలనుకున్న సినిమాలన్నీ చేసేయాలనుకున్నాడు.
వీలైనంత మేర నాలుగు లేదా అయిదు సినిమాలు చేయాలని.. వీటి ద్వారా ఓ 200 కోట్లు సంపాదించాలని.. అప్పుడే ఎన్నికల ముంగిట పార్టీకి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవచ్చని, ఎవరి మీదా ఆధారపడకుండా పని చేయొచ్చని పవన్ భావించాడు. కానీ కరోనా ఎఫెక్ట్‌తో పవన్ ప్లానింగ్ దెబ్బ తినేసింది. చేస్తున్న రెండు సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ రెండు చిత్రాలూ పూర్తి చేయడమే కష్టంగా ఉంది.
రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకుంటే సినిమాలు కొనసాగిస్తే వచ్చే ఏడాది చివరికి మహా అయితే మూడు సినిమాలు పూర్తి చేయగలడేమో. కరోనా దెబ్బకు పారితోషకాలు కూడా తగ్గించుకోవాల్సి వస్తే పవన్ పెట్టుకున్న టార్గెట్ అందుకోవడం అసాధ్యమేనేమో.