మరోపక్క, పెద్దిరెడ్డిపై ఆధిపత్యం సంపాదించేందుకోసం తన అధికారాన్ని వీలైనంత ఎక్కువగా (అవసరానికి మించి) వాడేస్తున్నారు ఎస్ఈసీ. ఆ విషయం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమయిపోయింది. ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఎస్ఈసీ ఆదేశాలివ్వడమేంటి.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ ఇటీవల జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో. అదే సమయంలో, ‘ఈయనసలు మంత్రేనా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని మ్యాడ్ ఫెలో.. అని ఎలా అనగలిగారు.?’ అని కూడా జనం ఆశ్చర్యపోయారు. పెద్దిరెడ్డి అంటే రాజకీయ నాయకుడు.. ఆయనకు ఉచ్ఛం నీఛం.. అనే అంశాల పట్ల పెద్దగా బేధాభిప్రాయాలు వుండేమో.. అని అంటోన్న రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డను పలు అంశాలపై సమర్థిస్తూనే, కొన్ని అంశాల్లో తప్పుపడుతున్నారు. పంచాయితీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యత మేరకు అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవాలు చేయించలేకపోయానన్న ఫ్రస్టేషన్ బహుశా మంత్రి పెద్దిరెడ్డికి వుండొచ్చుగాక.
అయితే మాత్రం, తన స్థాయిని మరిచి.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఆయనెలా చేస్తారు.? పైగా, అధికారుల్ని బెదిరించడమా.? ‘బ్లాక్ లిస్టులో పెడతాం’ అని అధికారులకు అల్టిమేటం జారీ చేస్తే ఎలా.? ఇప్పుడేమో, హైకోర్టు ఆదేశాలతో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి పెద్దిరెడ్డి ఎక్కడా ఏమీ మాట్లడటానికి వీల్లేకుండా పోయింది. ఎన్నికల విధుల నిర్వహణలో బిజీగా వున్న ఎస్ఈసీ నిమ్మగడ్డను సైతం పెద్దిరెడ్డి ఏమీ అనడానికి వీలుండకపోవచ్చు. ఆ లెక్కన, నిమ్మగడ్డకీ కొంత ఊరట హైకోర్టలో లభించిందనే అనుకోవాలేమో.