అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా లేక ఆంక్షలతో సడలిస్తారా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని లాక్ డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. కానీ అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు ప్రజల ప్రాణాలూ రెండూ తమకు ముఖ్యమేనని చెబుతున్న కేంద్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రధాని మోదీ మరోసారి మేరీ ప్యారీ దేశ్ వాసియో.. అంటూ ఎప్పుడు టీవీలో కనిపిస్తారా అని దేశం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. లాక్ డౌన్ పై అందరి అభిప్రాయాలూ తీసుకున్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
లాక్ డౌన్ పొడిగింపుపై హాంగ్ కాంగ్ మోడల్ ను అనుసరించే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనాకు పొరుగున ఉన్న హాంకాంగ్ లో జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 15 నాటికి వంద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. లాక్ డౌన్ విధించకుండానే హాంకాంగ్ ఈ వైరస్ పై చక్కని నియంత్రణ సాధించింది. ఇందుకోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి.
ముందుగా వైరస్ సోకినవారిని ఎక్కడికక్కడ వెతికి పట్టుకుని మరీ క్వారంటైన్ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేసింది. జనం బయట ఎక్కువగా తిరగకుండా ఆంక్షలు విధించింది. జనం సమూహాలుగా ఉండకుండా నిరోధించింది. మరోవైపు హాంకాంగ్ పౌరులు కూడా ప్రభుత్వానికి సహకరించారు. దీంతో కరోనా వైరస్ అక్కడ తీవ్రంగా వ్యాప్తి చెందలేదు. దీంతో ఇప్పుడు మన దేశంలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసి ఆ మోడల్ అనుసరిస్తారనే చర్చ సాగుతుంది. కానీ భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది వర్కవుట్ కాదని అంటున్నారు.
హాంకాంగ్ జనాభా 75 లక్షలు మాత్రమే. అలాంటిచోట్ల లాక్ డౌన్ లేకపోయినా కఠినమైన ఆంక్షల ద్వారా వైరస్ ను అదుపులోకి తెచ్చే వీలుంటుంది. కానీ 130 కోట్ల జనాభా కలిగిన మనదేశంలో అది అంత సత్ఫలితం ఇవ్వదని అంటున్నారు. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చి, మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించడం ఖాయమని అంటున్నారు.