ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖాస్త్రం: వేలకోట్లు వచ్చేస్తాయా మరి.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ, ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామనీ, మౌళిక వసతుల కోసం 34 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందనీ, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వమే భరించడం కష్టమవుతుందనీ, కాబట్టి కేంద్రం ఇతోదికంగా రాష్ట్రానికి సాయం చేయాలనీ ఆ లేఖాస్త్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. పీఎంఏవై నిధులు సరిపోవడంలేదన్నది ప్రధానంగా ఈ లేఖాస్త్రంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్య.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా లేఖ రాయగానే, అలా ప్రధాని నరేంద్ర మోడీ దిగొచ్చేస్తారన్నది వైసీపీలో కొందరి బలమైన విశ్వాసం. ‘కేంద్రం మెడలు వంచడం అంటే ఇదే..’ అని సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు చేస్తున్న ప్రచారమూ ఇదే. కానీ, వాస్తవం వేరేలా వుంది. విశాఖ రైల్వే జోన్ ఎప్పుడో ప్రకటించబడింది.. పేరు కూడా పెట్టేశారు. ఆ పనులు కాస్త కూడా ముందుకు నడవలేదు. వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టం ద్వారా ఇవ్వాల్సిన నిధుల వ్యవహారం ఏమయ్యిందో తెలియదు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇంకా పెండింగ్ నిధులు వున్నాయి.. కాదు కాదు కేంద్రం, రాష్ట్రానికి బాకీ పడింది. ఇవేవీ కేంద్రం నుంచి రానప్పుడు, 34 వేల కోట్లు అంటే మాటలా.? అన్నట్టు, వైఎస్సార్ జగనన్న కాలనీలు.. అంటూ సొంత పేర్లు పెట్టుకుంటూ, ఆ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయాన్ని అర్థించడం ఎంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ.

చంద్రబాబు హయాంలో నిర్మితమైన టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమవడాన్ని కేంద్రం పదే పదే తప్పుపడుతోంది.. బీజేపీ నేతలైతే, ఈ విషయంలో జగన్ సర్కార్ మీద పోరాటాలూ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సంక్షేమ పథకాల ప్రచారం కోసం వెచ్చిస్తోన్న సొమ్ముని.. ఇలాంటి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే, వేన్నీళ్ళకు చన్నీళ్ళ కింద ఉపయోగపడ్తాయ్ కదా.?

Exit mobile version