కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ విడతల వారీగా కొన…సాగు…తోన్న సంగతి తెలిసిందే. మే 17తో లాక్ డౌన్ 3.0 ముగుస్తుందనుకుంటున్న తరుణంలో ప్రధాని మోడీ వచ్చి లాక్ డౌన్ 4.0 ఉంటుందని బాంబు పేల్చారు.
అయితే, తొడపాశం పెట్టి చాక్లెట్ ఇచ్చినట్టు… వివిధ రంగాలకు 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి మరోసారి జనాలను
లాక్
డౌన్ చేశారు మోడీ మాస్టారు. యథా ప్రకారం తన ప్రసంగంతో….భారత్ పురోగమిస్తోందంటూ…. మోడీ మాటల గారడీ చేశారు. అందులోనూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేసరికి….ప్రజలు, పారిశ్రామిక వేత్తలూ ఊరటచెందారు.
ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీతో పాటు…స్వావలంబన భారత్…స్వదేశీ తయారీ..స్వదేశీ వాడకం…సంస్కరణలను మరింత విస్తృతం చేయడం వంటి విషయాలను మోడీ ప్రస్తావించారు.
ఇవన్నీ వినగానే సగటు భారతీయుడికెవరికైనా…ఈ స్థితిలో ఏ ప్రధాని అయినా ఇంతకన్నా ఏం చేస్తారు అనిపించక మానదు. అయితే, కొద్దిగా నిశితంగా పరిశీలిస్తే…ఈ నాలుగు పాయింట్లలో ఎన్నో మెలికలు…మరెన్నో కిటుకులు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
భారతదేశ జీడీపీలో 10 శాతం ప్యాకేజీ అని 20 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని మోడీ ప్రకటించారు. ఆల్రెడీ అంతకుముందు ప్రకటించిన 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా ఈ 20 లక్షల ప్యాకేజీలో కలిసే ఉంటుందన్నది మొదటి ట్విస్ట్. ఇప్పటికే 6లక్షల కోట్లు యం.యస్.యం.ఇ కంపెనీలకు ఇచ్చామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది రెండో ట్విస్ట్. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఉద్దీపనలు కూడా ఈ 20 లక్షల కోట్లలోనే కలిసున్నాయన్నది మూడో ట్విస్ట్.
వీటి తాలూకా మొత్తం 10 లక్షల కోట్లు పోగా…కొత్తగా ప్రభుత్వం ఇవ్వబోయేది మరో 10 లక్షల కోట్లన్నమాట. మొదటి గ్రూపులోని 10 లక్షల కోట్లు ఏమయ్యాయో …రెండో గ్రూపులోని 10 లక్షల కోట్లు ఏమవ్వబోతున్నాయో ఊహించవచ్చు.
స్వావలంబన భారత్…ఈ మాట వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే, మన దేశం తన కాళ్ల మీద తాను నిలబడి ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వ రంగం బలోపేతం కావాలి. కానీ, 1992 నుండి మొదలైన యల్.పి.జి విధానాల(సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) వల్ల స్వావలంబన కాగితాలకు, ప్రసంగాలకే పరిమితమైంది.
మనదేశపు అత్యుత్తమ ప్రధానుల్లో ఒకరైన వాజ్‌పేయి కూడా యల్.పి.జి విధానాలకే కట్టుబడ్డారు. “భారత్ లో తయారీ” పేరుతో సంపన్న వర్గాలు మరింత సంపన్నం కావడం తప్ప ఒరిగేదేమీ లేదు. శ్రమను చౌకగా చేసి కార్మిక చట్టాలలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మికుల పనివేళలు మార్పు చేయడం…(8 గంటలకు బదులు 12 గంటల షిఫ్ట్ లు) ఒ.టి విధానంలో మార్పులు మొదలైనవన్నీ ఇందులో భాగమే. ఈ విధానం వల్ల పెట్టుబడిదారీ వర్గానికి స్వావలంబన…కార్మిక వర్గాలకు నిరాశ తప్పదు.
సంస్కరణలను మరింత విస్తృతంగా అమలు చేయాలనేది ప్రధాని మోడీ చెప్పిన మూడో పాయింట్. ఇప్పటివరకు తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభాన్ని తట్టుకోగలిగిందని ప్రధాని చెప్పడం వాస్తవ దూరం. మోడీ హయాంలో జీడీపీ అధమ స్థాయికి చేరుకున్నా….భారత్ ఈ స్థాయిలో కరోనాను కట్టడి చేయగలిగిందంటే ప్రభుత్వ వ్యవస్థల వల్లనే అని చెప్పవచ్చు.
కరోనా సంక్షోభంలో వైద్య వ్యవస్థ, బ్యాంకింగ్, రైల్వేలు, ఇన్సూరెన్స్, విమానయాన, రక్షణ రంగాలు అద్భుతమైన పాత్ర పోషించాయి. కరోనా రోగులకు చికిత్స చేయలేమంటూ కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేస్తుంటే… ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా చికిత్స నందిస్తున్నాయి. మోడీ చెప్పిన “సంస్కరణల విస్తృతి” అమలు జరిగి ఉంటే కార్పొరేట్, కరోనా కోరల్లో చిక్కుకొని ఎన్నో వేల ప్రాణాలు పోయేవి.
2 నెలలుగా అదాయం లేక ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు యఫ్.ఆర్.బి.యం నిబంధనలను సడలించి ఋణ పరిమితి ఆంక్షలు ఎత్తి వేయాలని కోరుతున్నాయి. రాష్ట్రాల, ప్రజల హక్కులను హరించే అనేక షరతులను ఒప్పుకుంటేనే రాష్ట్రాలకు కోరిన నిబంధనలు సవరిస్తానని కేంద్రం షరతులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్మికుల పొట్ట కొట్టే విధంగా కార్మిక చట్టాల సవరణ, దళారీ వ్యవస్థను బలోపేతం చేసేలా వ్యవసాయ మార్కెటింగ్ చట్టంలో మార్పులు, పట్టణాభివృద్ధి సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు వంటి షరతులకు రాష్ట్రాలు ఒప్పుకోవాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. వాటికి ఒప్పుకుంటే కేంద్రం చేతిలో రాష్ట్రాలు తోలుబొమ్మలుగా మారతాయనడంలో సందేహం లేదు.
ప్రజలను కొల్లగొట్టి ఆ డబ్బులనే వారికి వరాలుగా ఇవ్వడం ఈ 20లక్షల కోట్ల ప్యాకేజీలో ఉన్న అసలు మర్మం. ధనవంతులపై పన్నులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ, ప్యాకేజీకి డబ్బులు కావాలి. అందుకు వేరే మార్గాలున్నాయి కేంద్రానికి. గత కొద్ది రోజులుగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలను ఒక్క రూపాయి కూడా తగ్గించని కేంద్రం…ఆ స్థానంలో ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచేసింది. ఎక్సైజ్ సుంకాలలో రాష్ట్రాల వాటాను తగ్గించి కేంద్రం వాటాను పెంచడం కొసమెరుపు. దీంతో, గత 2 నెలల కాలంలో కేవలం పెట్రోలియం ఉత్పత్తుల ఎక్సైజ్ సుంకాల ద్వారా కేంద్రం ఆదాయం మొత్తం 13 లక్షల కోట్లు. మొత్తం 20లక్షల కోట్ల ప్యాకేజీలో 70 శాతం దీని నుండే వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రతిపాదించిన పి.యం కిసాన్, ఉపాధి హామీ పధకాల నిధులు కూడా ఈ ప్యాకేజీ నుండే చెల్లిస్తారట.
మరోవైపు, 2019-20 జి.యస్.టి తాలూకా రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కూడా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో కలుపుతారనే ప్రచారం జరుగుతోంది.దీంతో, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఏమీ లేకపోగా దేశ ఆర్థిక పునాదులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ రంగాన్నిపాతాళానికి తొక్కేసి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, ప్రజలను కష్టాలపాలయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలు అప్రమత్తమై ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడకుంటే….ప్రజల ఆర్థిక స్థితిగతులు అధ్వాన్నంగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.