ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

2021 రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఇంగ్లండ్ ప్రధాని.. ఆహ్వానించిన మోదీ

కరోనా నేపథ్యంలో దేశాధినేతల కలయికకు పరిస్థితులు అనుకూలించ లేదు. ఇప్పుడు ఇద్దరు అగ్ర దేశాధినేతల కలయికకు రంగం సిద్ధమవుతోంది. 2021 భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి బోరిస్ జాన్సన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య నవంబర్ 27న ఫోన్ లో పలు అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషన్ స్కోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఈ ఆహ్వానాన్ని ధ్రువీకరించారు. అయితే.. బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటనపై ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత జాన్సన్ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మోదీ, జాన్సన్ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు, రెండు దేశాలు అవలంబించాల్సిన పద్ధతులు, రక్షణ, పారిశ్రామికం, పెట్టుబడులు, బ్రెగ్జిట్ తర్వాత ఇంగ్లాండ్ పరిస్థితులు అన్నీ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బ్రిటన్ లో జరిగే జీ7 సదస్సుకు మోదీని బోరిస్ జాన్సన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో ముఖ్య అతిధిగా విచ్చేశారు. చివరిగా 1993లో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేయర్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తర్వాత మరే అధికారిక పర్యటన కూడా జరగలేదు. ఇందుకు కరోనా పరిస్థితులు కూడా కారణమయ్యాయి.

Exit mobile version