ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రెండేళ్లు కష్టాలు తప్పవంటున్న ప్రకాష్‌ రాజ్‌

కరోనా ప్రభావం నుండి ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేదంటూ సినిమా పరిశ్రమ ప్రముఖులు పదే పదే చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్స్‌ అయితే ప్రారంభం అవుతాయేమో కాని ఇతర పరిస్థితులు ఏవీ కూడా మునుపటిలా ఉండవంటున్నారు.

సినిమా నిర్మాణం నుండి మొదలుకుని వసూళ్ల వరకు అన్ని విషయాల్లో కూడా పెను మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. అందుకే సినిమాల నిర్మాణంను కనీసం ఆరు నెలల వరకు ఆపేస్తేనే బెటర్‌ అనే అభిప్రాయంను పలువురు ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విషయమై విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ స్పందిస్తూ… అన్ని రంగాల మాదిరిగానే సినిమా పరిశ్రమ కూడా కరోనా కారణంగా తీవ్రమైన అవస్థలు పడుతుంది. ఈ సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి సాయం చేసేందుకు నిలవడం చాలా మంచి పరిణామం.

ఇక లాక్‌ డౌన్‌ తర్వాత కూడా పరిస్థితి వెంటనే మార్పు రాకపోవచ్చు అన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనీసం రెండేళ్ల వరకు కొనసాగే అవకాశం ఉందన్నాడు.

ఈ మార్పుకు సినీ జనాలు అలవాటు పడాలి. ప్రేక్షకులు థియేటర్లకు మునుపటి మాదిరిగా ఎలాంటి భయం లేకుండా వచ్చే వరకు సినిమా పరిశ్రమకు కష్టాలు తప్పవన్నాడు. రెండేళ్ల వరకు ఈ పరిస్థితి ఉంటుందని, మునుపటి పరిస్థితుల్లోకి సినిమా ఇండస్ట్రీ రావాలంటే మరో రెండేళ్లు అయినా వెయిట్‌ చేయాల్సిందే అని, అందుకోసం ప్రతి ఒక్కరు సిద్దంగా ఉండాలంటూ సూచించాడు.

సినిమాల మేకింగ్‌ కూడా సగానికి పడిపోయే అవకాశం ఉందని ప్రకాష్‌ రాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దాంతో సినీ కార్మికులకు కష్టాలు కంటిన్యూ అవుతాయనే అభిప్రాయంను ప్రకాష్‌ రాజ్‌ వ్యక్తం చేశాడు.

Exit mobile version