ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పీకే యూ టర్న్ టు కాంగ్రెస్..! ఏం జరుగుతుందో..?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తరపున పని చేయబోతున్నారా..? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మంగళవారం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను ఆయన కలుసుకోవటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం.. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని పీకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనంతరం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్.. ఇతర పార్టీ నేతలతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాహుల్ ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ వార్తలకు ఊతమిస్తూ 2024 ఎన్నికల్లో పీకే కాంగ్రెస్ తరపున ప్రధాన పాత్ర పోషించబోతున్నారు అని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పీకే గతంలోనూ కాంగ్రెస్ కు పని చేశారు.

2017 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసినా అనుకున్న ఫలితాలు రాలేదు. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారం చేపట్టింది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో సహా మరో మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీకే కాంగ్రెస్ పార్టీకి పని చేయబోతున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

Exit mobile version