ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సురేశ్ ప్రొడక్షన్స్ బంగారు బాతు.. ‘ప్రేమనగర్’కు 49 ఏళ్లు

టాలీవుడ్ లో సురేశ్ ప్రొడక్షన్స్ కు 50 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానం ఉంది. సంస్థ అధినేత డి. రామానాయుడు అద్భుతమైన సినిమాలెన్నో నిర్మించారు. అంతేకాకుండా.. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తెరకెక్కించి భారతీయ సినీ పరిశ్రమలో సురేశ్ సంస్థకు ఓ ప్రత్యేకత తీసుకొచ్చారు. ఈ సంస్థకు ఎన్టీఆర్ రాముడు-భీముడు నారు పోస్తే ఏఎన్నార్ ‘ప్రేమనగర్’ నీరు పోసింది. రాముడు-భీముడు తర్వాత ఫ్లాపులతో నష్టాల్లో ఉన్నారు రామానాయుడు. ఆఖరి ప్రయత్నంగా చేసిన సినిమానే ‘ప్రేమనగర్’. ఈ సినిమా సాధించిన అద్భుత విజయం తెలుగు సినీ ప్రస్థానంలో సురేశ్ ప్రొడక్షన్స్ కు తిరుగులేకుండా చేసింది.

1971 సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు నేటితో 49 ఏళ్లు పూర్తయ్యాయి. కోడూరి కౌశల్యాదేవి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మాంచారు. అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ ఈ నవల చదివి సినిమాగా చేస్తే బాగుంటుందని చెప్పారట. నిజానికి ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత నిర్మించాల్సింది. ఆయనకు యాక్సిడెంట్ అయి వెనక్కుతగ్గితే ఆయన నుంచి రామానాయుడు హక్కులు తీసుకుని నిర్మించారు. దీంతో ‘ప్రేమనగర్’ సురేశ్ సంస్థకు బంగారు బాతై కూర్చుంది. సినిమాను కె.ఎస్. ప్రకాశ రావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈయన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి.

ప్రేమనగర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు నటన, స్టైల్, డైలాగ్ డిక్షన్, సినిమాలో ఆయన మందు తాగే సన్నివేశాలు నాగేశ్వరరావుకి బ్రాండ్ అయిపోయాయి. వాణిశ్రీ అందం.. ఏఎన్నార్ తో ప్రేమ సన్నివేశాలకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. కేవీ మహదేవన్ సంగీతంలోని పాటలన్నీ మోగిపోయాయి. 13 సెంటర్లలో 100 రోజులు ఆడి కొన్ని సెంటర్లలో 25 వారాలు రన్ అయింది. తమిళ్, హిందీ భాషల్లో కూడా తెరకెక్కి అద్భుత విజయం సాధించింది.

Exit mobile version