పూరి జగన్నాద్ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్ తో చేశారు. బద్రి సినిమాపై మొదట్లో ఎవరికి అస్సలు అంచనాలు ఆసక్తి లేదట. కాని అనూహ్యంగా ఆ సినిమా హిట్ అవ్వడంతో స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. 2000 సంవత్సరంలో బద్రితో ఎంట్రీ ఇచ్చిన పూరి 2001లో బాచి సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మిస్ ఫైర్ అయినా కూడా అదే సంవత్సరంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘ఇడియట్’ సినిమాతో పూరి యూత్ లో యమ క్రేజ్ ను దక్కించుకున్నాడు. 2002లో ఇండియట్, 2003లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మరియు శివమణి సినిమాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుల జాబితాలో చేరి పోయాడు.
ఎన్టీఆర్ తో 2004లో తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కాస్త నిరాశ మిగిల్చినా 2006 సంవత్సరంలో మహేష్ బాబుతో ‘పోకిరి’ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్ నిరంజన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. పూరి చేసిన సినిమాల్లో ఏక్కువ శాతం సక్సెస్ రేటు ఉండటం ఆయన ప్రత్యేకత. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో సినిమాను తీయడం ఆయన నుండి నేర్చుకోవాలంటూ ఒక సినిమా వేడుకలో రాజమౌళి అన్నారంటే ఆయన స్టామినా సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
దేవుడు చేసిన మనుషులు సినిమాను ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించి ప్రయోగాలకు ఎప్పుడు వెనకాడను అంటూ పూరి మరోసారి నిరూపించుకున్నాడు. ఒక వైపు సూపర్ స్టార్స్.. స్టార్స్ తో సినిమాలు చేసే పూరి మరో వైపు జ్యోతిలక్ష్మి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కాస్త డల్ గా ఉన్న కెరీర్ ను పీక్స్ లోకి తీసుకు వెళ్లిన పూరి ప్రస్తుం విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందుతుంది.
పూరి ఇప్పటి వరకు తెలుగులోనే కాకుండా హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలను కూడా చేసే అవకాశం ఉంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో పూరిఆకాష్ కు సక్సెస్ దక్కతుందని భావించగా నిరాశే మిగిలింది. ప్రస్తుతం తనయుడితో ఒక సినిమాను పూరి నిర్మిస్తున్నాడు.
నిర్మాత దర్శకుడిగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పూరి జగన్నాద్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి మర్చి పోలేని సినిమాలను అందించారు. ఆయన దర్శకత్వంలో ముందు ముందు కూడా మరిన్ని ఇస్మార్ట్ మూవీస్ రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు మా మీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాం. ఆయన ముందు ముందు మరిన్ని సూపర్ హిట్ లను దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యపీ బర్త్ డే ఇస్మార్ట్ డాషింగ్ డైరెక్టర్ పూరి.