ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కాపీ ఆరోపణలు.. రిలీజయ్యాక చూద్దామంటున్న సుక్కు

సుకుమార్-అల్లు అర్జున్‌ల కొత్త సినిమా ‘పుష్ప’ అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తన రచనల ఆధారంగానే తయారైందంటూ వేంపల్లి గంగాధర్ అనే కడప జిల్లా ప్రముఖ రచయిత పరోక్షంగా ఆరోపిస్తూ పెట్టిన ఫేస్ బుక్ పోస్టు చర్చనీయాంశంగా మారింది.

ఎర్రచందనం అక్రమ రవాణా కడప, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగేది, ఇప్పటికీ కొంతమేర జరుగుతోంది అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగాధర్ పెట్టిన పోస్టుకు మద్దతుగా చాలామంది వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ను అనుమానంగా చూస్తున్నారు. ఐతే ఈ విషయంలో సుకుమార్ ఎలా స్పందిస్తాడు అని అంతా ఎదురు చూస్తున్నారు.

గంగాధర్ ఇంతకుముందు త్రివిక్రమ్ మీద కూడా ఆరోపణలు చేశాడు. తన ‘మొండికత్తి’ కథ ఆధారంగానే త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమా తీశాడని ఆరోపించాడు. త్రివిక్రమ్‌ను తాను కలిశానని.. ఇన్‌పుట్స్ కూడా ఇచ్చానని.. కానీ తనకు క్రెడిట్ కూడా ఇవ్వకుండా తన కథను, ఆలోచనలను త్రివిక్రమ్ కాపీ కొట్టాడని ఆరోపించాడు.

ఇప్పుడు అదే కోవలో తన ఎర్రచందనం రచనలను ప్రస్తావిస్తూ సుకుమార్ మీద ఆరోపణలు చేయడంతో ‘పుష్ప’ మీద అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. కానీ సుకుమార్ మాత్రం ఈ ఆరోపణలపై స్పందించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గంగాధర్ కథను, ఇతర రచనలను ఇప్పటికే చదివిన ఆయన.. వాటికి, తన కథకు ఏమీ సంబంధం లేదని సన్నిహితుల వద్ద అభిప్రాయపడ్డారట.

కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం రవాణాకు సంబంధించి అందరికీ తెలిసిన విషయాల్లో సారూప్యతలు కనిపించవచ్చేమో కానీ.. అంతకుమించి గంగాధర్ రచనలతో తన కథకు సంబంధం లేదన్నది ఆయన వెర్షన్. ఐతే ఇప్పుడు తాను స్పందిస్తే గంగాధర్‌కు ప్రచారం లభిస్తుందని.. మీడియాలో అవనసరంగా వివాదం నడుస్తుందని.. కాబట్టి సైలెంటుగా ఉండాలని సుక్కు నిర్ణయించుకున్నాడు. ఒకసారి సినిమా రిలీజైతే.. అప్పుడు తన కథను, గంగాధర్ రచనలను పోల్చి చూసిన జనాలు వాస్తవం తెలుసుకుంటారు.. అప్పటిదాకా ఎవరేమనుకున్నా పర్వాలేదన్నది ఆయన అభిప్రాయం అని సమాచారం.

Exit mobile version