ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇసుక కుంభకోణం గురించి రోజూ చర్చ జరుగుతోంది. ‘వసూళ్ళ దందా’ గురించి విన్పిస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అధికార పార్టీ నేతలే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటోంటే.. ఇంకెక్కడుంది జవాబుదారీతనం.? ఇక, ఈ వ్యవహారంపై ఓ న్యూస్ ఛానల్ ‘నారద’ పాత్ర పోషించింది. సదరు ఎంపీని, ఆ ఎమ్మెల్యేలనీ కలిపే బాధ్యత తీసుకుంది. నారుదుడు కదా.. చిచ్చు పెట్టాల్సింది పోయి, కలపడమేంటి.? అంటే.. అదే మరి అసలు ట్విస్ట్. అది వైసీపీ అనుకూల మీడియా గ్రూప్‌లోని ఛానల్.
ఎంపీగారితో పదే పదే ‘నారదుడు’ అని పిలిపించుకున్న సదరు సీనియర్ జర్నలిస్ట్, ఎలాగైతేనేం.. గొడవను రెచ్చగొడ్తున్నట్లే రెచ్చగొట్టి.. చివరికి ఎలాగైతేనేం.. అందర్నీ కలిపేందుకు ప్రయత్నించారు. అప్పటిదాకా తిట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. చివరికి ‘భార్యా భర్తల మధ్య గొడవలుంటాయ్.. అవి సద్దుమణుగుతాయ్.. మేమంతా కలిసిపోవడం కూడా అంతే..’ అని తేల్చేశారు. ఇదండీ జరిగిన కథ.
ఇంతకీ, ఇసుక దొంగ మాటేమిటి.? కరోనా సాయం ముసుగులో వసూళ్ళకు పాల్పడిన ఆ వసూల్ రాజా సంగతేంటి.? ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో అడ్డగోలుగా కమిషన్ నొక్కేస్తోన్న అధికార పార్టీ నేతల పరిస్థితేంటి.? ఎంపీగారు చేసిన ఆరోపణల పర్వం ఇక్కడితో ముగిసిపోతుందా.? లేదంటే, ఆ ఎంపీతోపాటు మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల బరిలో తమ సత్తా ఏంటో చాటుకుంటారా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలే. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
ప్రస్తుతానికి ‘కాంప్రమైజ్’ అంటోన్న ఎంపీ మరియు ఎమ్మెల్యేలు.. ముందు ముందు ఈ కథను ఎలాంటి సరికొత్త ట్విస్టులతో రక్తికట్టిస్తారో వేచి చూడాల్సిందే.