అసలు రఘురామ శరీరం మీద గాయాలే లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విషయం విదితమే. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మెడికల్ సర్టిఫికెట్ కూడా తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి భార్య డాక్టర్ కావడంతోనే ఆ రిపోర్ట్ వచ్చిందని రఘురామ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించారు. సర్వోన్నత న్యాయస్థనంలో రఘురామ తరఫు న్యాయవాది ముఖుల్ రహోత్గి, ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టుని పరిగణనలోకి తీసుకుంది.. ఆ రిపోర్టుని సమర్థించింది కూడా. అంటే, దీనర్థం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించిన మెడికల్ రిపోర్టు.. తప్పుడు వ్యవహారమేని తేలినట్టే కదా.? రఘురామపై ఏపీ సీఐడీ ఎలాంటి దాడీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. ‘కారులో సుదూరం.. విజయవాడ నుంచి హైద్రాబాద్ ప్రయాణం చేస్తున్నప్పుడు అద్దానికి కాలు తగిలి, కాలి వేలు ఫ్రాక్చర్ అయి వుండొచ్చు..’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది వినిపించిన వాదన హాస్యాస్పదంగా మారింది.
ప్రస్తుతానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైనా, ఆ షరతుల సడలింపు కోసం మరోమారు రఘురామ కోర్టును ఆశ్రయించడం ఖాయం. దాదాపుగా ప్రతి కేసులోనూ బెయిల్ అనేది షరతులతోనే కూడి వుంటుంది. కానీ, ఆ తర్వాతే వాటి నుంచి సడలింపులు వస్తుంటాయి. సో, రఘురామ నోటికి తాళం.. అనేది తాత్కాలికం మాత్రమే.
ఇక, విచారణ నిమిత్తం.. ఎప్పుడు పిలిచినా హాజరు కావడం.. అనేది కూడా ఓ నామమాత్రపు తంతుగానే మారిపోయింది ప్రస్తుత వ్యవస్థలో. ఎలా చూసినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. కోర్టు ధిక్కరణ వ్యవహారం.. అరెస్టు చేసి గాయపర్చారనే ఆరోపణలు.. వీటన్నిటి నడుమ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పుకుంటుందో వేచి చూడాల్సిందే.