ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ ఆసుపత్రి డిశ్చార్జి సమ్మరీ ఇస్తే, తగిన నిర్ణయం తీసుకుంటామని సీఐడీ కోర్టు చెప్పినట్లు రఘురామ తరఫు న్యాయవాదులు అంటున్నారు.

మరోపక్క, తనను కొద్ది రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే వుంచాలంటూ రఘురామ, ఏకంగా ఆర్మీ ఆసుపత్రి ‘కమాండర్’కు లేఖ రాశారన్న ప్రచారం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఆ లేఖలో రఘురామ పేర్కొన్నారట. అదెలా.? ఆర్మీ ఆసుపత్రిలో ఏం జరుగుతోందనే విషయం బయటకు ఎలా పొక్కుతుంది.? ఇదే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న విషయం.

రఘురామ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాల్సి వుంటుంది. బెయిల్ మంజూరయ్యింది గనుక, రఘురామకు సంబంధించిన విషయాలపై ఆయన తరఫు లాయర్లకూ సమాచారం వుండొచ్చు. మీడియాలో ఎలా ఈ అంశంపై వార్తలు వస్తున్నాయి.? ఏమోగానీ, రఘురామ బెయిల్ మీద విడుదలవడం ఆలస్యమవుతుంది గనుక, ఈలోగా ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి ఏపీ సీఐడీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

ఇది రఘురామ సన్నిహితుల నుంచీ, రఘురామని మోస్తోన్న టీడీపీ అనుకూల మీడియా కారణంగా జరుగుతున్న దుష్ప్రచారమే తప్ప, ఇందులో వాస్తవం లేదన్నది అధికార పార్టీ వాదన. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బెయిల్ వస్తే, వెంటనే విడుదలయిపోతుంటారు.. అప్పటిదాకా ఆసుపత్రుల్లో చికత్స పొందుతున్నాసరే. కానీ, ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది.

రఘురామ ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగాలేదా.? అంతలా ఆయన ఇబ్బంది పడటానికి కారణమేంటి.? రఘురామ విడుదలైతేగానీ ఈ అంశంపై స్పష్టత రాదు. మరోపక్క, రఘురామను అరెస్టు చేశాక ఆయనపై తీవ్రమైన దాడి చేశారనీ, థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ ఆరోపిస్తూ రఘురామ తనయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ కేసు ఈ రోజే విచారణకు రానుంది.

Exit mobile version