ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వైసీపీపై రఘురామ సెటైర్లు.. వైసీపీకి మళ్ళీ తలనొప్పి షురూ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారవుతున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ‘మీ కేసుల విచారణ 11 ఏళ్ళుగా జరుగుతోంటే, నా కేసుల విచారణ వెంటనే జరగాలనడమేంటి.?’ అంటూ సొంత పార్టీని ప్రశ్నించారు రఘురామ. ఇక్కడ రఘురామ ప్రస్తావన వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మీద కేసుల గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.?

2018లో వైఎస్ జగన్, ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిపై కామెంట్ చేస్తే బెయిల్ రద్దు చేయాలని కోరిన సీబీఐ, ఇప్పుడు ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ‘కోర్టు విచక్షణ మేరకు బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోండి..’ అని కోర్టుకు తెలపడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు, నిందితుల బెయిల్ రద్దు కోసమే ప్రయత్నిస్తాయిగానీ, జగన్ విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ, రఘురామ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ కేసు విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజుతో విచారణ ఓ కొలిక్కి వస్తుందని తాను బావిస్తున్నానని, 26న తుది ఉత్వర్వులిస్తారని న్యాయమూర్తి చెప్పినట్లు తమ న్యాయవాది తెలిపారనీ, అందుకే ఆ రోజు చాలా ముఖ్యమైనదనీ, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాననీ రఘురామ చెప్పడం గమనార్హం.

తన మీద విమర్శలు చేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్ పైనా రఘురామ సెటైర్లు వేశారు. భరత్ నటించిన సినిమా హిట్టయి వుంటే, ప్రజలు మంచి నాయకుడ్ని కోల్పోయేవారని ఎద్దేవా చేశారు. అంతేనా, ఆవ భూముల్ని పేదల ఇళ్ళ కోసం ఎంపిక చేసి ముఖ్యమంత్రి మనసుని దోచిన భరత్, అనేక నియోజకవర్గాలకు ఎదగాలని రఘురామ చేసిన వ్యాఖ్యల్లో మర్మమేంటన్నదానిపై భిన్న వాదలున్నాయి.

మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం. ప్రతి విషయాన్నీ సున్నితంగానే పేర్కొంటూ, సూటిగా గుచ్చేస్తోంటే.. అధికార పార్టీకి ఆ తలపోటు తీవ్రస్థాయిలో వుంటోంది. నిజమే మరి, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాల్లో పార్లమెంటు స్తంభింపజేయలేకపోతున్న వైసీపీ (అధికారంలోకి వచ్చాక), కేవలం రఘురామపై అనర్హత కోసం పార్లమెంటుని స్తంభింపజేస్తామనడమేంటి.? అధికార పార్టీ డొల్లతనాన్ని రఘురామ బయటపెడ్తున్న వైనం, ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Exit mobile version