ప్రభుత్వమే అఫిడవిట్ రూపంలో రఘురామపై సుప్రీంకోర్టు యెదుట కోట్లాది చెల్లింపుల పేరుతో ఆరోపణలు చేసిందంటూ ఓ కథనం వచ్చిన విషయం విదితమే. ఇక, రఘురామ.. చంద్రబాబు దర్శకత్వంలో నటిస్తున్నారన్నది వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. ఇందుకు సంబంధించి వాట్సాప్ మెసేజీల సారాంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఐడీ అఫిడవిట్ ద్వారా న్యాయస్థానానికి విన్నవించుకుందట. ‘నేనింకా వైసీపీ నాయకుడ్నే..’ అని అంటున్నారు రఘురామ. ‘నిన్ను పార్టీ నుంచి బహిష్కరించేశాం..’ అని వైసీపీ నేతలు రఘురామ గురించి మాటలు చెబుతున్నారుగానీ, చేతల్లో బహిష్కరణాస్త్రం మాత్రం ప్రయోగించడంలేదాయె.
అధికార పార్టీ దృష్టిలో, ప్రభుత్వ పెద్దల దృష్టిలో రఘురామ చేసిన అతి పెద్ద నేరం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ప్రయత్నించడం. బెయిల్ రద్దు పిటిషన్, చంద్రబాబు సూచనల మేరకు జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై చంద్రబాబు నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక రఘురామ, మార్పులు చేర్పులు కూడా చేయించారట. అందుకు తగ్గ సమాచారం రఘురామ ఫోన్‌లోనే లభ్యమయ్యిందని ఏపీ సీఐడీ పేర్కొందట.
అలాగని వైసీపీ అనుకూల మీడియాలోనే కథనాలొస్తున్నాయి. రఘురామకృష్ణరాజు ఓ ప్రజా ప్రతినిథి. ఆయన, ప్రతిపక్ష నేతతో మాట్లాడటం నేరమైతే కాదు. బెయిల్ రద్దు పిటిషన్ ఆయన వేయడం అనేది వేరే చర్చ. ఒకదానికొకటి సంబంధం లేని అంశాల్ని కలగాపులగం చేసేసి అధికారాన్ని అడ్డగోలుగా వాడేయడం వల్లే జగన్ సర్కారుకి న్యాయస్థానాల్లో పదే పదే మొట్టికాయలు పడుతున్నాయి. నిన్నే ఎన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో సుప్రీం మొట్టికాయ చూశాం. రఘురామ వ్యవహారంలోనూ అదే జరగబోతోందా.? వేచి చూడాల్సిందే.