ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు మించి మాట్లాడలేం..’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోరుతూ రఘురామ, సీబీఐ కోర్టును కొన్నాళ్ళ క్రితం ఆశ్రయించిన విషయం విదితమే. కేసు విచారణ సందర్భంగా సీబీఐ చేతులెత్తేసింది. ‘కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోండి..’ అని సీబీఐ, కోర్టుకి తెలిపింది. అప్పుడే ఈ కేసు విషయమై రఘురామ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాగా, విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం, తీర్పు వెల్లడిపై కొంత గ్యాప్ తీసుకోవడం, ఇంతలోనే సాక్షి మీడియా, ‘రఘురామ పిటిషన్ కొట్టివేత.. జగన్, విజయసాయి బెయిల్ రద్దు విషయంలో రఘురామకి షాక్..’ అంటూ ప్రచారం చేసిందో.. ఆ తర్వాత రఘురామ అలర్ట్ అయ్యారు.

సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకుండా చూడాలనీ, కేసు విచారణను మరో బెంచ్‌కి బదిలీ చేయాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, రఘురామకి హైకోర్టులో ఆశించిన శుభవార్త అందలేదు. రఘురామ పిటిషన్‌ని హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో, సీబీఐ కోర్టు.. తీర్పు వెల్లడించడానికి మార్గం సుగమం అయ్యింది. జగన్ సహా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ఊహించినదేననీ, తాను ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ ఓ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఒకవేళ హైకోర్టులో కూడా తీర్పు తనకు అనుకూలంగా రాని పక్షంలో సుప్రీంకోర్టు తలుపు తడతానని రఘురామ చెప్పడం కొసమెరుపు. రాజకీయంగా తనను వేధింపులకు గురిచేయడం, బెయిల్ షరతుల్ని ఉల్లంఘించడం.. ఇన్ని చేస్తున్నా.. ఈ వివరాలు న్యాయ వ్యవస్థ ముందుంచినా, జగన్ అలాగే విజయసాయిరెడ్డి బెయిల్ ఎందుకు రద్దవలేదో తనకు అర్థం కావడంలేదని అంటున్నారు రఘురామ.

తగ్గేదే లే.. సుప్రీంకోర్టుకైనా వెళతానని రఘురామ అంటున్నారు సరే.. అక్కడైనా రఘురామ కోరుకున్న ‘న్యాయం’ జరుగుతుందా.? అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version