ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజుగారి ‘బాంబు’: ఇది కూల్చే పార్టీ.. అది కట్టే పార్టీ.!

‘దేవాలయాల్ని కూల్చే పార్టీతో దేవాలయాల్ని కట్టే పార్టీ జత కడుతుఉందా.?’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారైన రాజుగారు, వీలు చిక్కినప్పుడల్లా తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద ‘ప్రేమ’ ప్రదర్శిస్తూనే, వైసీపీ ప్రభుత్వాన్నీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీనీ ఏకిపారేస్తూనే వున్నారు.

‘రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..’ అంటూ షరామామూలుగానే విరుచుకుపడిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాతీలోనే చదువుకున్నారు.. దేశానికి ప్రధాని అయ్యారు. ఆయనేమీ ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదు..’ అంటూ వైఎస్‌ జగన్‌ ‘మీడియం ఆతృత’పై సెటైర్లు వేశారు ఈ నర్సాపురం ఎంపీ.

ఇదిలా వుంటే, మరో వైసీపీ ఎంపీ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆక్షేపణలు చేస్తూ ఓ లేఖాస్త్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో 2016 నుంచి 2019 వరకూ మోకాలి శస్త్ర చికిత్సలు జరిగాయనీ, గడచిన ఎనిమిది నెలలుగా అవి ఆగిపోయాయంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు.

గతంలో అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతుల వద్దకు వెళ్ళిన కృష్ణదేవరాయులు, అప్పట్లో రైతులకు సంఘీభావం ప్రకటించడం కూడా వైసీపీలో ముసలం రేపింది. ఆ తర్వాత ఆయన అధిష్టానానికి బద్ధుడై వుండిపోయారనుకోండి.. అది వేరే విషయం. ఇదిలా వుంటే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ఇప్పటికే వున్న అక్రమాస్తుల కేసు విచారణలో వేగం పెరగపోతేందనీ, ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోబోతున్నారనీ, త్వరలోనే వైసీపీలో భూకంపం వస్తుందనీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జోస్యం చెబుతోంది.

Exit mobile version