Advertisement

సొంత ఎంపీ రఘురామ బండారం బయటపెట్టుకున్న వైసీపీ

Posted : October 9, 2020 at 4:02 pm IST by ManaTeluguMovies

రాజకీయాల్లో ఎవరు ఎంత ఉత్తములో.. ఆయా రాజకీయ పార్టీలే సందర్భానుసారం చెప్పేస్తుంటాయి. ప్రస్తుతానికి తమ ఎంపీ రఘురామకృష్ణరాజు బండారాన్ని అధికార వైసీపీ బయటపెట్టుకుంది. ఎందుకంటే, రఘురామకృష్ణరాజు వైసీపీకి కొరకరాని కొయ్యిగా తయారయ్యారు మరి. ఏకంగా 23 వేల కోట్ల రూపాయల అప్పులున్నాయట రఘురామకృష్ణరాజుకి. అంటే, ఆయనకు చెందిన కంపెనీలకి.

‘ఇండ్‌ భారత్‌’ కంపెనీకి సంబంధించి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగ్గొట్టారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదయ్యింది. ఈ కేసులో పలు చోట్ల సీబీఐ నిన్న సోదాలు నిర్వహించింది. అయితే, తనకు ఈ సోదాలపై ఎలాంటి సమాచారం లేదనీ, తన ఇల్లు లేదా కార్యాలయాలపై ఎలాంటి సోదాలు జరగలేదని రఘురామకృష్ణరాజు తెగేసి చెబుతున్నారు.

‘ఈ మధ్యనే మా పార్టీకి చెందిన నేతలు సదరు బ్యాంకు పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఈ హంగామా మొదలైంది..’ అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. ‘వాళ్ళలాగా నేను డిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకునే రకం కాదు..’ అంటూ సరాసరి ముఖ్యమంత్రి సహా పలువురు వైసీపీ నేతలపై రఘురామ నిన్న ఓ ఛానల్‌ ఇంటర్వ్యూతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు ఢిల్లీలో రఘురామ రచ్చబండ కార్యక్రమం పెట్టబోతున్నారట. దాంటో, మరింతగా వైసీపీని ఏకిపారేయనున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. అయితే, సీబీఐ మాత్రం.. ఆయా కంపెనీలకు సంబంధించిన పలు చోట్ల సోదాలు నిర్వహించినట్లు నోట్‌ విడుదల చేసింది. కానీ, ఆ నోట్‌లో ఎక్కడా రఘురామకృష్ణరాజు పేరు లేకపోవడం గమనార్హం.

కాగా, ఆ సంస్థకు తానే ప్రమోటర్‌నని రఘురామరాజు ఒప్పుకోవడం మరో ఆసక్తికరమైన అంశం. ఏదిఏమైనా, 2019 ఎన్నికలకు ముందే రఘురామకృష్ణరాజుపై పలు ఆరోపణలున్నాయి. ‘బ్యాంకుల్ని ఎగ్గొట్టేసిన దొంగ..’ అంటూ రఘురామపై అప్పట్లో రాజకీయ విమర్శలు వచ్చాయి. అంతకు ముందు ఆయన వేరే పార్టీలో వుండడంతో వైసీపీ నేతలే ఆయన మీద ఆ ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికల్లో గెలుపు కోసం రఘురామ అవసరం రావడంతో.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించారు.

‘మా రాజుగారు మహా గొప్పోరు..’ అంటూ వైసీపీ నేతలంతా కొత్త బాకా ఊదారు. మళ్ళీ ఇప్పుడు అదే వైసీపీ, ఆయన్ని ‘దొంగోడు’ అనే ముద్ర వేయడం గమనార్హం. వైసీపీలోనే కాదు, చాలా రాజకీయ పార్టీల్లో ఈ తరహా బ్యాంకుల్ని ముంచేసిన ఆరోపణల్ని చాలామంది ఎదుర్కొంటున్నారు.

కానీ, సందర్భానుసారం మాత్రమే ఆయా వ్యక్తులు ‘మంచి – చెడు’ అన్నట్లుగా ప్రొజెక్ట్‌ అవుతున్నారు. ఆలోచించుకోవాల్సింది ప్రజలే. రాజకీయ నాయకులు, పార్టీలు.. ఎప్పుడు ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నాయో ఆలోచించి ఎన్నికల్లో ఓటేస్తేనే రాజకీయ నాయకులు కుప్పిగంతులు వెయ్యకుండా వుంటారు.


Advertisement

Recent Random Post:

Kantara A Legend Chapter-1 Hindi 2nd Oct 2025 |RishabShetty|Ajaneesh

Posted : November 18, 2024 at 6:54 pm IST by ManaTeluguMovies

Kantara A Legend Chapter-1 Hindi 2nd Oct 2025 |RishabShetty|Ajaneesh|

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad