టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో జస్టిస్ ఎన్వీ రమణ నడుస్తున్నారనీ, హైకోర్టు తీర్పులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనీ తన ఫిర్యాదులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా వుంటే, తెలుగు మీడియాలో టీడీపీ అనుకూల వర్గం, ఈ వ్యవహారాన్ని పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇలాంటి పత్రికల్ని ఇంటికి తెచ్చుకుని చదువుకోవాలా.? ఇంట్లో కూర్చుని వీటిని చూడాలా.?’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించిన వ్యవహారాలు ఏనాడైనా సాక్షిలో దర్శనమిచ్చాయా.? అన్నది టీడీపీ సహా ఇతర విపక్షాల వాదన. ఏదిఏమైనా, రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పోరాటాలు, ఆరాటాలూ చోటు చేసుకుంటున్నాయి. ప్రతి విషయాన్నీ కులం కోణంలోనో, మరో రాజకీయ కోణంలోనో చూడటం ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలకు అలవాటైపోయింది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా కేసుల వ్యవహారం నడుస్తోంది.. అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పైనా కేసుల వ్యవహారం నడుస్తోంది.
ఈ తరుణంలో, ఏకంగా సుస్రీంకోర్టు న్యాయమూర్తిపైన ఆరోపణలు చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదమేంటన్నది ఇంకో వెర్షన్. ఏమో, భవిష్యత్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా వుంటాయోగానీ.. ప్రస్తుతానికైతే.. ‘న్యాయ దేవత వస్త్రాపహరణం’ అన్న చర్చ మాత్రం సర్వత్రా విన్పిస్తోంది.