‘నేను సినిమా డైలాగ్ చెప్పాను. నేను సింహాన్ని కాదు.. మీరు పందులు కాదు..’ అంటూ తనదైన స్టయిల్లో సెటైరేశారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తాపీగా. ఇక, తాజాగా ‘సింహం – సింహాసనం’ అంటూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి వైసీపీది. ఇటీవల వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్ళి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు ‘సీటు’ వెనక్కి జరపబడింది కూడా. ‘నా సీటుని వెనక్కి నెట్టి.. నన్ను ఇంకా పెద్దవాడ్ని చేశారు.. ఇకపై పార్లమెంటులో పార్టీ తరఫున మాట్లాడేందుకు నాకు సమయం దొరక్కపోవచ్చు. కానీ, నష్టం లేదు. నాకు ఎంపీగా వున్న హక్కుల్ని, అవకాశాల్ని వినియోగించుకుని.. మరింత సమర్థవంతంగా ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తాను..’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఇదిలా వుంటే, రాష్ట్రంలో గోశాలల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తాజాగా లేఖాస్త్రం సంధించారు రఘురామకృష్ణరాజు. గత కొద్ది రోజులుగా లేఖల మీద లేఖలు రాస్తూ అధికార పార్టీకి మరింత తలనొప్పిగా మారుతున్న రఘురామకృష్ణరాజు, ‘పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద నాకున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవు. నేనింకా పార్టీలోనే వున్నాను.. పార్టీతోనే వుంటాను..’ అని పాత పాటే పాడుతుండడం గమనార్హం.
మరోపక్క, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నిన్న రఘురామకృష్ణరాజు అరగంటకు పైగా ప్రత్యేకంగా సమావేశమవడం మరో రాజకీయ దుమారానికి కారణమయ్యింది.